VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 9:25 pm Posted by : VISWAM VOICE DAILY

ఎడిటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

అధ్యక్షుడిగా వీరభద్రరాజు.. కార్యదర్శిగా పుర్రె త్రినాధ్

జాయింట్ సెక్రటరీగా ఖండవెల్లి సునీల్ కుమార్

ప్రింట్ మీడియా పరిరక్షణకు సమష్టిగా ముందుకు సాగాలని తీర్మానం

కాకినాడ గ్రామీణ, ఆగస్టు 11, విశ్వం వాయిస్ న్యూస్: 

ప్రింట్ మీడియా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటూ, పత్రికల సంపాదకుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన ప్రయోజనాల పరిరక్షణకు మరింత సంఘటితంగా ముందుకు సాగాలని ఎడిటర్స్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.

కాకినాడ రూరల్ మండల కార్యాలయంలో మంగళవారం ఎడిటర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. అనంతరం అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ఎడిటర్లు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిణామాలు, పెరుగుతున్న ముద్రణ వ్యయం, పంపిణీ ఖర్చులు, ప్రకటనల ఆదాయం తగ్గుదల తదితర కారణాలతో ప్రస్తుతం ప్రింట్ మీడియా మనుగడ సవాలుగా మారిందన్నారు. ఆర్థిక భారాలను అధిగమిస్తూ పత్రికలను కొనసాగించడం చిన్న, మధ్య తరహా పత్రికల నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎడిటర్లందరూ పరస్పర సహకారంతో ఒకరికొకరు అండగా నిలవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వలాభాలకు అతీతంగా అన్ని పత్రికల అభివృద్ధి, సంపాదకుల సంక్షేమం లక్ష్యంగా అసోసియేషన్ పనిచేయాలని సూచించారు.

అసోసియేషన్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి

ఎడిటర్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత విస్తరించి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. నూతన కార్యవర్గంతో పాటు ప్రతి సభ్యుడు సంఘం అభివృద్ధిలో భాగస్వామి కావాలని కోరారు.

నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించిన తొలి నెలలోనే వివిధ రంగాలకు చెందిన కనీసం ఐదుగురు ప్రముఖులను కలిసి, ఎడిటర్స్ అసోసియేషన్ లక్ష్యాలు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను వారి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన ప్రతి సంపాదకుడికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని, ఎడిటర్లకు ఎదురయ్యే వృత్తిపరమైన, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి సంఘం అండగా నిలవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వద్ద ఎడిటర్ల సమస్యలను సమష్టిగా ప్రస్తావించే బలమైన వేదికగా అసోసియేషన్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.

నూతన కార్యవర్గం ఇదే

ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వీరభద్రరాజు, కార్యదర్శిగా పుర్రె త్రినాధ్, కోశాధికారిగా దొరబాబు ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ఎం.టి. విక్టర్, జాయింట్ సెక్రటరీలుగా ఖండవెల్లి సునీల్ కుమార్, బషీర్ అలీ ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షుడిగా కోనేటి శ్రీనివాస్, గౌరవ సలహాదారుడిగా వి.వి.ఎస్. ప్రకాష్, న్యాయ సలహాదారుడిగా పితాని రాము బాధ్యతలు చేపట్టనున్నారు.

కార్యవర్గ సభ్యులుగా గునిపే శోభన్, ఎం.ఎస్. వాసు, సత్యనారాయణ (నాని), గరగ ప్రసాద్, రమణ కుమార్ ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సమావేశంలో పాల్గొన్న ఎడిటర్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఎడిటర్స్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, సంపాదకుల సమస్యల పరిష్కారం, పత్రికా రంగ అభివృద్ధి, జర్నలిజం విలువల పరిరక్షణ కోసం ఐక్యంగా పనిచేయాలని నూతన కార్యవర్గం సంకల్పం వ్యక్తం చేసింది.