VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:19 pm Posted by : VISWAM VOICE DAILY

కొత్త ఎక్సైజ్ పాలసీపై కసరత్తు.

మంగళగిరి, NTR (VISWAM VOICE DESK):

రాష్ట్రంలో  ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో, తదుపరి రిటైల్ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై మంత్రుల బృందం గురువారం మంగళగిరిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై విస్తృతంగా చర్చించింది. గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మతో పాటు ఎక్సైజ్ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

2024–26 రిటైల్ ఎక్సైజ్ పాలసీ అమలు ద్వారా జూలై 2026 వరకు వచ్చిన ఫలితాలపై అధికారులు మంత్రుల బృందానికి సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీ సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో, ఆ తర్వాత అమలు చేయాల్సిన కొత్త రిటైల్ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రూపొందించిన వివిధ నమూనాలను కూడా సమావేశంలో అధికారులు మంత్రుల బృందం ముందు ఉంచారు. కొత్త పాలసీ రూపకల్పన కోసం వివిధ వర్గాల నుంచి అందిన సూచనలు, అభిప్రాయాలను కూడా వివరించారు.

ప్రతిపాదించిన వివిధ నమూనాలపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అందుబాటులో ఉన్న సమాచారం, గణాంకాలను పరిశీలించిన అనంతరం ప్రతిపాదిత నమూనాలను మరింతగా సవరించి, సంబంధిత పూర్తి వివరాలు, ఆధారిత గణాంకాలతో మరోసారి సమర్పించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది.

ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ పనితీరు, ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 30 తర్వాత అమలు చేయాల్సిన కొత్త రిటైల్ ఎక్సైజ్ పాలసీని రూపొందించే ప్రక్రియలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించారు.