RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
రామచంద్రపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి నిర్వహిస్తున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నవంబర్ 20న రత్నంపేట మున్సిపల్ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 13వ అదనపు జిల్లా జడ్జి బి.హెచ్.వి. లక్ష్మీ కుమారి, రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఎం. శేషు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎల్. వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి-2 వి. నాగేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.ఎస్. పద్మావతి తదితరులు హాజరయ్యారు. తొలుత ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బి.హెచ్.వి. లక్ష్మీ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా బాలికలు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌తో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎం. శేషు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న అనేక మంది అధికారులు గ్రంథాలయాల్లో చదువుకుని ఎదిగిన వారేనని పేర్కొన్నారు. ఎల్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితాంతం విద్యార్థులుగానే ఉంటూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని, పుస్తక పఠనాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు. వి. నాగేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. వారోత్సవాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నవంబర్ 14 నుంచి 19వ తేదీ వరకు పాఠశాల విద్యార్థులకు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, నీతి కథలు, వక్తృత్వం, సంగీతం, క్విజ్, రంగోలి పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ స్థానాలు సాధించిన మొత్తం 90 మంది విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, గ్రంథాలయ ఉద్యోగులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.