కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా రిహార్సల్స్ నిర్వహించారు. అనంతరం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
కాకినాడ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ జరిగాయి. అనంతరం ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ భానుగుడి సెంటర్ వరకు కొనసాగింది. మార్గమధ్యంలో విద్యార్థులు, పోలీసులు “భారత్ మాతాకీ జై”, “వందేమాతరం” అంటూ దేశభక్తి నినాదాలు చేయడంతో ప్రాంతమంతా దేశభక్తి భావంతో మార్మోగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ వందేమాతరం నినాదం, జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరసత్వ భావనతో ముందుకు సాగాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశభక్తి భావన బలపడినప్పుడే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, అదనపు ఎస్పీ ఏఆర్ ఎస్. శ్రీనివాసరావు, ఎస్‌బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ వి.జి. శ్రీహరిరావు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, ఎన్‌సీసీ క్యాడెట్లు, సుమారు 1,500 మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
