VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 10:32 pm Posted by : BOMMU DURGARAO

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం నందు ఘనంగా హిందీ భాషా దినోత్సవం

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందీ భాష నేర్చుకోవడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి ఎలాంటి భాషా సమస్య ఉండదని తెలిపారు. రాష్ట్ర భాషతో పాటు జాతీయ భాషపై కూడా మంచి ప్రావీణ్యత ఉండాలని, కళాశాలలో ద్వితీయ భాషగా హిందీ ఉండటం విద్యార్థులకు మంచి అవకాశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హిందీ అధ్యాపకులు ఆర్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, హిందీ భాషలో అత్యంత విలువైన సాహిత్య విషయాలు ఉన్నాయని, భారతదేశమంతా ఏకతాటిపై నడవడానికి ఈ భాష ఎంతో సహకరించిందని తెలిపారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్రాంత అధ్యాపకులు సయ్యద్ ఆదా హుస్సేన్ మాట్లాడుతూ, నిత్యం మాట్లాడటం ద్వారా హిందీని సులువుగా నేర్చుకోవచ్చని, వాణిజ్య మరియు వ్యాపార రంగాల్లో హిందీ దేశంలోనే ప్రథమ స్థానంలో, ప్రపంచ భాషల్లో రెండవ స్థానంలో ఉందని విద్యార్థులకు వివరించారు. హిందీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.వి. రమణ ఈ దినోత్సవ విశిష్టతను తెలియజేశారు.