VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:44 pm Posted by : BOMMU DURGARAO

దాతల సహకారంతో ద్రాక్షారామ పాఠశాలలో ఇంటర్ ప్లస్ విద్యార్థులకు మెరుగైన వసతులు

Draksharama (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ద్రాక్షారామం నున్నవారి వీధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేరిచర్ల శేఖర్ తెలిపారు. పాఠశాలలో ఇంటర్ ప్లస్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రయోగశాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఇక్కడ విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్ షేక్ జమీల, సభ్యురాలు దుర్గ సూచన మేరకు ఇదే పాఠశాలలో గతంలో చదువుకున్న దర్భా సుబ్రహ్మణ్యం సుమారు రూ.10 వేల విలువైన మైక్రోస్కోప్, గ్యాస్ బర్నర్‌తో పాటు ఇతర ప్రయోగశాల పరికరాలను విరాళంగా అందజేశారు. 2027 మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రధానోపాధ్యాయులు ప్రకటించారు. మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి రూ.10,000, రెండో ర్యాంకు సాధించిన విద్యార్థినికి రూ.5,000, మూడో ర్యాంకు సాధించిన విద్యార్థినికి రూ.1,116 బహుమతిగా అందించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రయోగశాల పరికరాలను విరాళంగా అందించిన దర్భా సుబ్రహ్మణ్యంను ఉపాధ్యాయ బృందం శాలువా, జ్ఞాపికతో సత్కరించింది. పి. జి. టీ పిల్లి రాంబాబు మాట్లాడుతూ పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని అడ్మిషన్లు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఆరవవిస్సు, సీనియర్ ఉపాధ్యాయులు ఖాజా మొహిద్దీన్, వి. పద్మావతి, ఉమాపతి, శ్రీనివాస్, కోడి ప్రసాద్, గాయత్రి, కళ్యాణి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.