VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 7:43 pm Posted by : BOMMU DURGARAO

రామచంద్రపురంలో రూ. 2.4 కిలోల బంగారం చోరీ కేసులో నలుగురి అరెస్టు

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

కాకినాడ నుండి రావులపాలెం వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద కత్తులతో బెదిరించి సుమారు 2.4 కిలోల బంగారాన్ని దోచుకున్న ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్రకు చెందిన జితేంద్ర సింగ్ రాజ్ పురోహిత్ బంగారు వస్తువుల ఆర్డర్లు తీసుకునేందుకు ఈ నెల 22న కాకినాడలోని జిజిహెచ్ హాస్పిటల్ వద్ద రావులపాలెం వెళ్లే బస్సు ఎక్కారు. శాంపిల్ కోసం తన వెంట సుమారు 2 కిలోల 400 గ్రాముల బంగారు వస్తువులను తీసుకెళ్లారు. రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సు దిగి తన స్నేహితుడు దినేష్ జైన్ వద్దకు వెళుతుండగా, ఐదుగురు వ్యక్తులు తెల్లని స్కార్పియో కారులో వచ్చి కత్తులతో బెదిరించి ఆయన వద్ద ఉన్న బంగారాన్ని అపహరించి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 153/2026, సెక్షన్ 308(5) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితులు మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 29న మధ్యాహ్నం తోటపేట, ద్రాక్షారామం పరిధిలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసులను చూడగానే వారు పారిపోతుండగా అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక బంగారు ఉంగరం, కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగతా ముద్దాయిల కోసం గాలింపు తీవ్రతరం చేసినట్లు ఆయన వెల్లడించారు.