VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:09 pm Posted by : BOMMU DURGARAO

భాష్యం పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

విద్యార్థులకు చట్టాలు, బాలల హక్కులు, భద్రతపై అవగాహన

రామచంద్రపురం:విశ్వం వాయిస్ న్యూస్

స్థానిక భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ పి. భాస్కరరావు అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడ్వకేట్ ప్యానల్ సభ్యుడు డి. సత్యనారాయణ, వార్డు మహిళా పోలీస్ కానిస్టేబుల్ జి. నళిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద మాట్లాడుతూ విద్యార్థులు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా బాలబాలికల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో (చట్టం, మైనర్లపై జరిగే నేరాలు, వాటి నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహాయం కోసం చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను సంప్రదించాలని తెలిపారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, వాటి దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ జి. నళిని మాట్లాడుతూ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాలను వివరించారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, జాతీయ అత్యవసర సేవల నంబర్ 112, పోలీస్ సహాయం కోసం 100 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు, ప్రిన్సిపల్స్ పి. భాస్కర్, జి. శాంతి, విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు చట్టాలు, హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడింది.