RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం వెలుపల ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ (ఎండోమెంట్) శాఖకు అప్పగించాలంటూ నోటీసులు జారీ చేయడంపై మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్సార్‌సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకే ఎండోమెంట్ శాఖ అడిషనల్ సూపరింటెండెంట్ ఈ నోటీసులు జారీ చేసినట్లు వారు తెలిపారు.
1963లో నిర్మించిన నాటి నుంచి ఈ ఆలయం ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతోందని, అన్ని సేవా కార్యక్రమాలను వారే పర్యవేక్షిస్తున్నారని వారు గుర్తుచేశారు. ఈ ఆలయానికి ఎలాంటి స్థిరాస్తులు గానీ, చెప్పుకోదగ్గ ఆదాయం గానీ లేవని స్పష్టం చేశారు. ఆదాయం, ఆస్తులు లేని ఆలయంపై ఎండోమెంట్ నిబంధనలు మోపడం ఎంతవరకు సమంజసమని వారు మీడియా ద్వారా ప్రశ్నించారు. ఆలయ చారిత్రక నేపథ్యం, ట్రస్ట్ చేస్తున్న సేవలు మరియు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.