VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:06 pm Posted by : BOMMU DURGARAO

రామచంద్రపురం ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఎన్.జి.సి. వర్క్‌షాప్

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

రామచంద్రపురం పట్టణంలోని ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాలలో కె.గంగవరం మరియు రామచంద్రపురం మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులందరి కొరకు నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్.జి.సి.) ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాప్ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి. రామలక్ష్మణ మూర్తి పర్యవేక్షణలో సాగిన ఈ కార్యక్రమానికి రామచంద్రపురం ఎస్.కె.పి.జి.ఎన్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. వీరరాఘవ రెడ్డి అధ్యక్షత వహించి ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్.జి.సి. కోఆర్డినేటర్ పి.ఆర్.జి.ఎన్.వి. ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి సభికులనుద్దేశించి ప్రసంగించారు. నేటి ఆధునిక కాలంలో మానవ తప్పిదాల వల్ల ప్రకృతికి జరుగుతున్న ముప్పును వివరించారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులలో పర్యావరణ స్పృహను పెంపొందించాలని, పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వర్క్‌షాప్‌లో స్థానిక అధికారులు ఎం. శ్రీనివాసరావు, వి. నాగేశ్వరి, ఎ. నాగరాజు తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించారు. పాఠశాల స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన వివిధ రకాల కార్యక్రమాల గురించి, ప్రభుత్వ పరంగా అందుతున్న సహకారాన్ని వారు వివరించారు.

కార్యక్రమంలో భాగంగా రిసోర్స్ పర్సన్ ఎం. రామలక్ష్మి ఎన్.జి.సి. నిర్వహణ విధానం మరియు ప్రకృతి కనెక్ట్ యాప్ యొక్క ప్రాముఖ్యతను, దానిని ఉపయోగించే విధానాన్ని ఉపాధ్యాయులకు సమగ్రంగా వివరించారు. ఉపాధ్యాయులు సైతం ఈ యాప్‌ను విద్యార్థులలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.

వర్క్‌షాప్ ముగింపు దశలో పర్యావరణ హితమైన పలు ఆచరణాత్మక కార్యకలాపాలను నిర్వహించారు. విద్యార్థుల చేత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటించడం, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై విస్తృతమైన అవగాహన కల్పించడం, మట్టితో కూడిన సీడ్‌బాల్స్ (విత్తన బంతులు) మరియు పర్యావరణానికి హాని చేయని విత్తనాల గ్రీటింగ్ కార్డుల తయారీ వంటి వినూత్న కార్యక్రమాలను ఎంతో ఉత్సాహంగా విజయవంతంగా పూర్తి చేశారు.