VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 10:32 pm Posted by : khandavelli567@gmail.com

గుర్రపు డెక్కతో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు

కరప, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):

కాలువల్లో పెరిగి నీటి పారుదలకు అడ్డంకిగా మారుతున్న గుర్రపు డెక్కను సంపదగా మార్చి, డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా శిక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.

కరప మండలం గొర్రిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంలో డీఆర్డీఏ–సెర్ఫ్ ఆధ్వర్యంలో కరప, కాజులూరు మండలాల స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపు డెక్కతో వివిధ కళాకృతులు, బొమ్మల తయారీపై నిర్వహిస్తున్న నెల రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ట్రైనీ కలెక్టర్ ప్రియతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గుర్రపు డెక్కను ఎండబెట్టి తయారు చేసిన కళా ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడి శిక్షణ వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్రపు డెక్కను ఉపయోగించి వివిధ అలంకరణ వస్తువులు, కళాకృతులు తయారు చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. గుర్రపు డెక్క సీజనల్‌గా మాత్రమే లభించే అవకాశం ఉన్నందున, ఇతర కాలాల్లోనూ ఉపాధి కొనసాగించేందుకు జ్యూట్ బ్యాగుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘స్వయం’ బ్రాండ్ ద్వారా ఉత్పత్తుల విక్రయానికి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఉపయోగించే బహుమతి బ్యాగులు, గృహ అలంకరణ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు.

ఆన్‌లైన్ వేదికల ద్వారా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉత్పత్తుల తయారీతో పాటు మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారిస్తే గ్రామీణ మహిళలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవచ్చన్నారు.

40 మంది డ్వాక్రా మహిళలకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణకు డీఆర్డీఏ, యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఒక్క అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలుస్తుందని, బ్యాగుల తయారీకి అవసరమైన ఫోల్డింగ్, ప్రెస్సింగ్ తదితర యంత్రాలను సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జి. శ్రీనివాసరావు, డీపీఎం టీ. బాబురావు, కరప తహసీల్దార్ లక్ష్మి సరస్వతి, ఎంపీడీవో జె. శ్రీనివాసు, ఏపీఎంలు ఎన్. సత్యనారాయణ, టీ. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.