– ఆధార్ కార్డుల సాకుతో స్కూళ్ళలో ప్రవేశం తిరస్కరణ
– పిల్లలు బిచ్చగాళ్ళుగా మారుతున్న వైనం
– నీరు కారిపోతున్న విద్యాహక్కు చట్టం
– 100 శాతం అక్షరాస్యత సాధించిన కేరళ ఆదర్శం…
– చిట్టిచేతుల చిన్నారులు ….
– బాల కార్మికులౌతున్నారు….
– ఆడిపాడాల్సిన బాల్యం… ఆగమైపోతుంది.
– తల్లిదండ్రుల పేదరికం ఒకవైపు…
– నిరక్షరాస్యత మరోవైపు… వెరసి
-స్వేచ్ఛా విహంగంలో
– విహరించాల్సిన బాల్యం ..
– బందీ గా మారింది.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ పత్యేక ప్రతినిధి న్యూస్ (సి. హెచ్.ప్రతాప్):
: బడిలో సందడి చేయాల్సిన బాల్యం చెత్తకుప్పల్లో మగ్గిపోతోంది. పుస్తకాలు చేత పట్టాల్సిన ప్రాయం యాచనలో కూరుకుపోతోంది. పాపం, పుణ్యం తెలియని చిన్నారుల జీవితం కూలి పనుల్లో సమిధైపోతోంది. తల్లిదండ్రుల సంరక్షణలో ఆనందంగా, ఆహ్లాదంగా గడవాల్సిన చిన్నతనం వీధిన పడుతోంది. పేదరికం, సామాజిక వెనకబాటుతనం, తల్లిదండ్రుల ఆదరణ కొరవడటం, దురలవాట్లకు బానిసలుగా మారటం, కుటుంబ ఆనవాయితీ… ఇలా కారణాలు ఏవైనా బంగారు బాల్యాన్ని చిదిమేస్తున్నాయి.
గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే మధ్య నాలుగు విడతల్లో ఏపీ పోలీసుశాఖ నిర్వహించిన ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా సంరక్షించిన 34,037 మంది బాలల వివరాల్ని విశ్లేషిస్తే.. వారిలో 51.54 శాతం మంది కూలీలుగా మగ్గిపోతున్నట్లు, 1.95 శాతం మంది యాచనతో నెట్టుకొస్తున్నట్లు, 12.19 శాతం మంది నిరాశ్రయులై వీధి బాలలుగా గడుపుతున్నట్లు వెల్లడైంది. 68.16 శాతం మంది బాలలు పేదరికం వల్లే ఇలాంటి జీవనం సాగిస్తున్నట్లు తేలింది…
పేదరికమే శాపం అవుతోంది:
తల్లిదండ్రుల పేదరికం పిల్లల పాలిట శాపంగా మారుతొంది. మనకు స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంకా మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువగా 68. శాతం ప్రజలు జీవిస్తున్నారని 2021 నాటి గ్లోబల్ ఎం పి ఐ సర్వే తెలియజేస్తోంది . నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నీళ్లలా ఖర్చుచేస్తున్నా సంపూర్ణ ఆక్షరాస్యత సాధించలేకపోతున్నారు. వయోజన విద్య, అక్షరసంక్రాంతి, అక్షరభారతి, సాక్షరభారత్ పేర్లతో ఎన్ని కార్యక్ర మాలు తీసుకున్నా నేటికి ఏఒక్క గ్రామంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించలేకపోవడం దురదృష్టకరం.
ముక్కుపచ్చలారని వయసులోనూ:
ముక్కుపచ్చలారని వయసులోనూ అనేక మంది చిన్నారులు.. వీధి బాలలుగా మారిపోతున్నారు. ఆపరేషన్ ముస్కాన్లో గుర్తించిన వారిలో 772 మంది 0-5లోపు వయసు కలిగినవారే. అసలు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని ప్రాయం వీరిది. ఎవరో చేసిన తప్పునకు వీరి జీవితం బలైపోతోంది.
పొట్టకూటి కోసం వీధులలో అడుక్కుంటున్న అలాగే సంచారం చేస్తూ వివిధ గ్రామాలకు వెళ్లి పనులు చేసుకొని జీవిస్తున్న కుటుంబాలకు ఆధార్ కార్డులు పొందే వీలు లేకపోవడంతో వారి పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశం లభించడం లేదు . తిండికి గడవడమే కష్టంగా వున్న వారికి ఇక ప్రైవేటు చదువులు అందని ద్రాక్ష అవుతొంది.
ఇటువంటి కుటుంబాలలో వారి పిల్లలను కూడా చిన్నప్పుడు బిచ్చగాళ్ళుగా , కాస్త పెద్దయ్యాక కూలీలుగా తయారు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బడిబాట పేరిట ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలను చేర్పించే పధకం చేపట్టినా గతంలో స్కూళ్లలో చదివి కుటుంబ ఆర్ధిక పరిస్థితి కారణంగా చదువులు మానేసిన వారిపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ఇటువంటి సంచార జాతుల వారు, వలస కూలీల పిల్లలపై దృష్టి సారించడం లేదు. అందరికి విద్య అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యా హక్కు చట్టం యొక్క లక్ష్యం నీరు కారిపోతుంది.
ఇటువంటి సంచార జాతుల సంక్షేమం పై దృష్టి సారించడంతో పాటు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలి. గ్రామ స్థాయిలో వీరికి నివాసం ఏర్పాటు చేయడంతో పాటు ఆర్ధిక స్వావలంబన కోసం ఉపాధి కల్పించాలి . వీరికి ఆధార్ కార్డులు అందించడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశం కల్పించాలి. ప్రభుత్వ పథకాలన్నింటినీ వీరికి కూడా వర్తింపజేయాలి. తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను బడిలో చేర్పించాలి, బాలకార్మికులుగా మారకుండా చూడాలి. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం మాదిరిగా ప్రతి ఒక్కరు వయోజనులతో కలిసి చదువుకోవాలన్న చట్టం తేవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత సాధ నలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. నిర క్షరాస్యత నిర్మూలన కార్యక్రమాలు పక డ్బందీగా అమలు చేసి ఫలితాలు రాబట్టాలి. కేరళ, పశ్చిమ బెంగాల్ రాషా్ట్రలను ఆదర్శంగా తీసుకోవాలి. పాఠశాలల్లో మౌలిక సదు పాయాలు కల్పించాలి. మహిళల అక్షరాస్యత పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవాలి. వారికోసం ప్రత్యేక బడులు, కళాశాలలు ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులను నియ మించాలి. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలుచేయాలి. 5-14 ఏళ్ల బాలబాలికలంతా బడిలో ఉండేలా చూడాలి. బాల్యవివాహాలు చేసిన వారిపై చట్టాలను కఠినంగా అమలు చేయాలి.