విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్, vishaka
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా… ఇప్పుడా పర్యటన రద్దయింది. ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, ప్రధాని పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు పీఎంవో వెల్లడించింది.
ప్రధాని తన పర్యటనలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన చేయడంతో పాటు, పలు రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. ఈ సభ నుంచే ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది.
ప్రధాని సభ కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పీఎంవో సమాచారంతో ఈ పనులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ సంస్థలు చెబుతున్నాయి.