విశ్వంవాయిస్ న్యూస్, vishaka
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం… వాయుగుండంగా మారింది. ప్రస్తుతం తూర్పు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 24 గంటల్లో వాయవ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 29 వరకు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు, ఎల్లుండి 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
ఇక, రేపు, ఎల్లుండి (ఈ నెల 26, 27 తేదీల్లో) నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ నెల 28న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ తన బులెటిన్ లో పేర్కొంది.
నవంబరు 29న గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు… విశాఖ, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.