విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ డ్రై డే పాటించి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకున్నట్లయితే డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమ లార్వాలు ప్రాథమిక దశలో ఉండగానే అరికట్టవచ్చని రావులపాలెం మండలం ఊబలంక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జి. దుర్గాప్రసాద్ అన్నారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం ఊబలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఇంటి వద్ద నీరు ఎంతో కొంత నిలవ ఉంటుందని, ముఖ్యంగా ఇంటి సన్ సైడ్, రుబ్బురోలు, తాగి పాడేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, పల్లపు ప్రాంతాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉండి దోమలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందన్నారు. దోమలు కుట్టడం వల్ల ప్రమాదకరమైన మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, పైలేరియా తదితర వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధులు సోకితే లక్షలాది రూపాయలు ఆసుపత్రిల్లో వైద్యానికి ఖర్చు పెట్టవలసి ఉంటుందన్నారు. ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే నీరు నిల్వ ఉండకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, సి.హెచ్.ఓ. కాంతమ్మ, సబ్ యూనిట్ ఆఫీసర్ రాజబాబు ఆరోగ్య విస్తరణ అధికారులు ఎం.ఎస్.ఎస్. సాయిరాం, పి.డి.డి. బిషప్, పి.హెచ్.ఎన్ అనురాధ, సూపర్ వైజర్ సామ్యూల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు…