విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, జూలై 22, (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఇరవై ఏండ్ల ప్రాయపు యువకుని దుర్మరణం మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. సముద్రపు ఒడ్డున విగత జీవుడై కనిపించడం, మరణించి మూడు రోజులు కావడం, మరణ కారణం తెలియక పోవడంతో మరణం అనుమానాస్పదంగా మారింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం దళిత కాలనీకి చెందిన దివంగత విలేకరి బందిలి సత్తిబాబు, ప్రభుత్వ చౌక ధరల దుకాణం నిర్వాహకురాలు బందిలి సరోజ దంపతుల రెండో కుమారుడే మృతుడైన సతీష్ చంద్ర (20). తూర్పు గోదావరి జిల్లా ఒకప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర మీద అభిమానంతో నామకరణమైన ఇతడు ఇంటర్మిడియట్ విద్య అనంతరం అన్నవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతను మూడు రోజుల క్రితం వెళ్ళి ఆచూకీ లేకుండా పోయాడు. కనీసం ఫోనుకు కూడా అందుబాటులో లేక తల్లి, అన్నయ్యలు తల్లడిల్లుతూ సతీష్ చంద్ర ఆచూకీ కోసం వెదుకు తున్నారు. ఇంతలో తొండంగి మండలం నర్సిపేట సముద్ర ఒడ్డున 20 ఏళ్ళ
యువకుడి శవాన్ని స్థానికులు గుర్తించారు. ఎస్సై రవికుమార్ మృత దేహాన్ని పరిశీలించి సముద్రం నుంచి
ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్టుగా భావించిన ఆయన మృతుడి చిరునామా కోసం సామాజిక మాధ్యమాల్లో చిత్రాలను విడుదల చేశారు. దీంతో మృతుడు శంఖవరం బందిలి సతీష్ చంద్ర అని రూఢీ అయ్యింది. మృతదేహాన్ని పంచనామా కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని గుర్తించామని, మరణ కారణాన్ని ఇంకా కనుగొన లేదని, శవపరీక్ష అనంతరమే చెప్పగలమని ఎస్సై. రవికుమార్ ” విశ్వం వాయిస్” దినపత్రిక ప్రతినిధికి వివరణ ఇచ్చారు.