విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా:
గ్రామ సచివాలయ నిర్వహణలో సంస్కరణల ఆవశ్యకత
– లక్షల వ్యయంతో సిబ్బందికి యూనిఫామ్ ల అందజేత
– మూణ్ణాళ్ళ ముచ్చట గా మారిన వైనం
– ఫిర్యాదుల హోదా తెలియక కాళ్లరిగేలా ప్రజల ప్రదక్షిణలు
– యాప్ ద్వారా పారదర్శకత తీసుకురావాలని డిమాండ్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
విశ్వం వాయిస్ ప్రత్యేక ప్రతినిధి సి.హెచ్.ప్రతాప్ : 2019 వ సంవత్సరంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అదే ఏడాది అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. తదుపరి ఏడాది జనవరి 26 నుంచి ఆయా సచివాలయాల్లో పౌరసేవలను ప్రారంభించింది. జిల్లాలో 1038 గ్రామ పంచాయతీ, ఎనిమిది పట్టణ స్థాయి సంస్థలు ఉండగా 884 గ్రామ, 171 వార్డు సచివాయాలను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయాల్లో 13 రకాల శాఖలు, పట్టణాల్లో ఆరు రకాల శాఖల సిబ్బంది నియమించారు. ఈ సచివాలయాల్లో ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 12వేల పోస్టులను భర్తీ చేశారు. వుంచారు. తన పరిధిలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు శ్రీఘ్రమే అందేందుకు చార్టర్ ఆఫ్ సర్వీసెస్ కూడా నిర్దేశించబడింది. సచివాలయ విధుల్లో భాగంగా సిబ్బందికి యూనిఫామ్ నిర్దేశించి వాటిని విధిగా ధరించాలన్న నిబంధన ప్రవేశపెట్టారు. సిబ్బందిపై ఆర్థిక భారం పడకుండా లక్షల వ్యయం చేసి మూడు జతల యూనిఫాంలు కూడా అందజేయడం జరిగింది.అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వలన సిబ్బంది యూనిఫాం ధరించడం అన్నది మూణ్ణాళ్ళ ముచ్చట గా మారింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల తనిఖీలు, సందర్శనల సందర్భంలో మాత్రమే వీరు యూనిఫారంలు ధరిస్తున్నారు. మిగితా సమయాల్లో తమకు ఇష్టం వచ్చిన దుస్తులలో కార్యాలయాలకు వస్తున్నారు. వారికి జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు కూడా ధరించకుండా ఉండడం వలన ఎవరు సందర్శకులో, ఎవరు సిబ్బంది అన్నది తెలియకుండా పోతోంది. వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలకు , కార్యాలయ సిబ్బంది ఎవరో తెలియక తికమక పడుతున్నారు. కొన్ని కార్యాలయంలో సిబ్బంది సందర్శకుల ప్రశ్నలకు జవాబివ్వకపోవడమో లేక నిర్లక్ష్యంగా జవాబివ్వడం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి సచివాలయ నిర్వహణ లో కొన్ని సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ముందుగా సచివాలయ నిర్వహణకు ఒక ప్రత్యేక యాప్ ను ఏర్పాటు చేయాలి.ఈ యాప్ ను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు అధికారులతో అనుసంధానించాలి. ఈ యాప్ లో ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి, ఉదయం , సాయంత్రం వరి అటెండెన్స్ ను ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా బయోమెట్రిక్ వ్యవస్థలో నమొదు చేయాలి. ప్రజల ఫిర్యాదులకు ఒక సూచన సంఖ్య ఇచ్చి , వాటి హోదాను యాప్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ప్రజలు మాటిమాటికీ కార్యాలయాలకు రానవసరం లేకుండా ఎస్ ఎం ఎస్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ వారికి తెలియపరుస్తుండాలి. అపరిష్కృత ఫిర్యాదులు పై అధికారులకు ఆటోమేటిక్ గా ఎస్కలేట్ అయ్యే సౌలభ్యం యాప్ లో ఉండాలి. ఇందువలన పారదర్శక వలన సాధ్యమవడమే కాకుండా సిబ్బందికి జవాబుదారీతనం కూడా సాధ్యమవుతుంది. తమ ఫిర్యాదుల పరిష్కారం ఎందుకు ఆలస్యమవుతోందని వివరాలు కూడా ప్రజలకు లభ్యమవుతాయి.