విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
అధ్వాన్నంగా చెత్త నిర్వహణ
– కంపు కొడుతున్న గ్రామాలు
– వ్యర్ధ నిర్వహణ నిబంధనలు బేఖాతరు
– వర్షాకాలంలో ప్రబలుతున్న వ్యాధులు
-పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం లో తీవ్ర అపారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చెత్త సేకరింపు మరియు నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేసి తదనుగుణంగా వ్యర్థాల నిర్వహణ చేయాలన్న నిబంధనలు స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారు. రామచంద్రపురం ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి వెంబడి గ్రామంలో సేకరించిన తడి పొడి మరియు ఎలక్ట్రానిక్ చెత్తా చెదారాలను ఒక పద్ధతి లేకుండా అన్ని నిబంధనలకు నీళ్లొదిలి గుట్టలుగా తీసేస్తున్నారు. పైగా ఆ చెత్తను వ్యర్ధ నిర్వహణ కేంద్రాలకు తరలించకుండా నెలల తరబడి అక్కడే వదిలేస్తుండడం తో ప్రజలు, ఈ దారి వెంట ప్రయాణం చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భరించలేని దుర్వాసనతో పాటు. ఈగలు, దోమలు, ఇతర క్రిమికీటకాదులకు నిలయంగా మారుతుండదంతో డెంగ్యూ, కలరా, ఫైలేరియా, డయేరియా వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. అట్లే రాయవరం మండలం పసలపూడి మెయిన్ కెనాల్ గట్టున గుట్టలు గుట్టలుగా వ్యర్థాలు పేరుకుపోయి అటు రైతులకు, ఇటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదే పరిస్థితి మొత్తం మండలం అంతటా కనిపిస్తుండటం గమనార్హం. పలు గ్రామాలలో రోడ్ల మార్జిన్లు, మండల కేంద్రమైన రాయవరం తుల్య బాగా నది గట్టు డంపింగ్ యార్డుల కింద మారిపోయాయి. ఈ చెత్త అంతా కాలువలో కలుస్తుండడం వలన నీరంతా కలుషితమై అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే చెత్త వేసి, వాటిని నెలల తరబడి తొలగించక పోవడం వలన గాలికి ఇవి ఎగిరి పంట పొలాల్లో పడుతున్నాయని, ఇందులో వున్న రసాయన వ్యర్ధాల వలన పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని , కాబట్టి మండలం లో చెత్త చెదారాల డంపింగ్ మరియు నిర్వహణ పట్ల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.