Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,036,152
Total recovered
Updated on October 5, 2022 7:16 AM

ACTIVE

India
35,843
Total active cases
Updated on October 5, 2022 7:16 AM

DEATHS

India
528,716
Total deaths
Updated on October 5, 2022 7:16 AM

అక్షరమా ….. ఆత్మహత్యలా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

అక్షరమా? ఆత్మహత్యలా ?

– మార్కులూ, ర్యాంకుల సాధనే ధ్యేయంగా విద్యాబోధన

– ఒత్తిళ్లను భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్య

– జైళ్లను తలపిస్తున్న కొన్ని కాలేజీలు

 

– ఉన్నత శ్రేణి విద్యాసంస్థలలో కూడ ఆత్మహత్యల పర్వం

– విద్యా సంస్థలపై నిఘా నియంత్రణ అవసరమంటున్న నిపుణులు

– తెలివితేటల వృద్ధి , జ్ఞాన సముపార్జన ధ్యేయంగా విద్యావ్యవస్థ రూపుదిద్దుకోవాలి..

 

అమలాపురం, రాజమహంద్రవరం, కాకినాడ, (విశ్వం వాయిన్ ప్రత్యేక ప్రతినిధి సి.హెచ్.ప్రతాప్): తోట సంయుక్త గత జనవరి నెలలో నిజామాబాద్ జిల్లాలో తన స్వగ్రామం వెళ్ళినప్పుడు, ఆమెతో వారం రోజులు ఎంతో ఉల్లాసంగా గడిపిన ఆమె కుటుంబ సభ్యులు ఆమె మనసులో ఏముందో కనిపెట్టలేకపోయారు. సెలవుల తర్వాత హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కాలేజీలో నీట్ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న ఆమె తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడిని తట్టుకోలేక నేను ఆత్మహత్యలకు పాల్పడుతున్నానని ఆమె తన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఆమెకు ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి. ఈ ఘటనపై మనో వైజ్ఞానిక వేత్తలు స్పందిస్తూ చదువులో మంచి మార్కులు వచ్చినంత మాత్రాన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోగలిగే సత్తా వుండాలన్న రూలేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. తర్వాత విజయవాడలోని

 

నిడమానూరు వద్ద ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ 2 వ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్ధిని, కడపలో ఎం సెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న మరొక విద్యార్థిని వరుస ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరిస్థితి ఎలా విషమించిందంతే 2019-20 వ విద్యా సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో పదవ తరగతి లో సరైన మార్కులు రాలేదని నెపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వున్నాయి. ఈ జాడ్యం ఇటీవల ఐ ఐటి వంటి ఉన్నత విద్యాసంస్థలకు కూడా పాకింది. 2018-21 ల మధ్య దెసంలో ఉన్నత విద్యాసంస్థలలో దాదాపుగా 20 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చెసుకున్నారు. గురువారంనాడు ఐ ఐటి చెన్నైలో ఫైనల్ ఇయర్ చదువుతున్న సుభాంశు శేఖర్ అనే విద్యార్ధి ఉరి వేసుకొని చనిపోయాడు. చదువు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, గత కొన్ని సెమెస్టర్లలో మంచి మార్కులు రావడం లేదని, ప్రొఫెసర్లు, సాటి విద్యార్ధుల అవహేళనలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ విద్యార్ధి తన సుసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఐ ఐ టి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో సీటు తెచ్చుకోగలిగే తెలివితేటలు వున్న విద్యార్ధి జీవితం లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేక పలాయన మంత్రం చిత్తగించే మానసిక దౌర్బల్యం కలగడం ఖచ్చితంగా చదువు వలన కలుగుతున్న ఒత్తిడి వలనేనని మానసిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటి సారాంశం ఒక్కటే, నేటి విద్యా వ్యవస్థలో వున్న డొల్లతనం. విద్య ప్రభుత్వ ఆధీనంలో వున్నంతకాలం ఆటపాటలతో ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు చదువుకునేవారు. ఉపాధ్యాయులు కూడా బి ఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కాబట్టి విద్యాబోధనలో ఎలాంటి ఒత్తిడికి తావిచ్చే వారు కాదు.

 

ప్రభుత్వ ఆధీనంలో నుండి విద్యా ప్రైవేట్ రంగం ఆధీనంలోకి ప్రవేశించాక విద్యా బోధన, జ్ఞాన సముపార్జన లకు బదులుగా మార్కులు, పర్సంటేజీలు ప్రాధాన్యత పెరిగింది. తమ సంస్థలకు ఎన్ని మంచి ర్యాంకులు వస్తే అంత పేరు వస్తుందన్న అంశంపై విద్యాసంస్థలు దృష్టి పెట్టసాగాయి.ఉదయం అయిదు గంటలకు స్టడీ అవర్ ప్రారంభమయ్యే చదువు రాత్రి పదకొండు గంటలకు ముగుస్తుంది. అంటే చదువు రోజుకు 18 గంటల పాటు కొనసాగుతుంది.ఆదివారం అయితే కేవలం సాయంత్రం మాత్రమే విరామం లభిస్తుంది. ఈ వ్యవస్థలో తెలివితేటలు, ఐ క్యూ వృద్ధి చేయడానికి బదులు పాఠాలు వల్లె వేయించి ,బట్టి పట్టడానికే ప్రాధాన్యత ఇస్తుండదం వలన విద్యార్థుల మేధోశక్తి అభివృద్ధి చెందడానికి అసలేమాత్రం అవకాశం ఉండటం లేదు. పైగా పొద్దున నుండి రాత్రి వరకు చదువులతో పాటు ఆటపాటలకు, విరామానికి, ఉల్లాసం కలిగించే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు ఎలాంటి ఛాన్స్ లేకుండా టైట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందువలన వారిలో ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. ఇష్టపడి హాయిగా చదువుకోవాల్సింది పోయి కష్టపడి , మొక్కుబడిగా ఒత్తిళ్ళ మధ్య చదువుకోవాల్సి వస్తోంది.

 

ఇది విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని మానసిక శాస్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వైఖరిలో ఎంతమాత్రం మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో మరి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్ధుల చదువులకు ఇబ్బంది కలుగుతుందని, వారి మొబైల్ ఫోన్లు కూడా యాజమాన్యం అదుపులో తీసుకుంటున్నారు.వారి కుటుంబ సభ్యులకు ఏదైనా ఆపద జరిగినా, కుటుంబంలో ఎలాంటి విషాదం సంభవించినా , వారి చదువులకు భంగం కలుగుతుందన్న నెపంతో వారికి ఈ విషయాలు తెలియనివ్వడం లేదు. విద్యార్ధి తన ఐ క్యూ ద్వారానే చదవగలడన్నది సైన్స్ ప్రామాణికంగా నిరూపించింది. అయితే ఈ కాలేజీలలో విద్యార్ధులను వారి తెలివితేటలతో సంబంధం లేకుండా మానసికంగా, శారీరకంగా హింసించి అయినా సరే చదివిస్తున్నారు. ఇటీవల విశాఖపట్నంలో ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఒక ఉపాధ్యాయుడు మార్కులు సరిగ్గా రాలేదని ఒక విద్యార్థిని షర్టు విప్పించి బెత్తంతో చావబాదుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. కాలేజి నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఈ బాగోతాన్ని చూసిన లోకం నివ్వెరపోయింది. ఇక సింహభాగం హాస్టళ్ళు జైళ్ళను తలపిస్తున్నాయి. ఒక పది నిముషాల పాటు కూడా రిలాక్సేషన్ కోసం బయటకు వెళ్ళే చాన్స్ లేదు.టివి, సినిమాల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కళ్ళు మూసినా, కళ్ళు తెరచినా చదువు..చదువు..చదువు. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య చదివే ప్రక్రియను తట్టుకోలేని విద్యార్ధులు చిన్న వయస్సులోనే జీవితం చాలిస్తున్నారు.

 

అయితే తప్పంతా కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వాహకులదే అని చెప్పలేం. చదువంటే మార్కులు, ర్యాంకులు, పెర్సెంటేజ్, ఐఐటీ, మెడికల్ సీట్లు అన్న భ్రమలో వుండే తల్లిదండ్రుల వలన ఈ విద్యాసంస్థలది ఆడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తొంది. ఈ క్రేజ్ ఎంతగా ఉందంటే వేసవి సెలవల్లో ఈ విద్యా సంస్థల యజమాన్యం తమ సిబ్బందిని ఇంటింటికీ పంపించి విద్యార్ధులను చేర్పించుకుంటున్నారు. సీటు గ్యారంటీ అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏటా లక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అవకుండా మిగిలిపోతున్నాయి. ఇంక ఎక్కడో అక్కడ సీటు రాకుండా ఎలా వుంటుంది ?. ఈ మాత్రం దానికి రోజుకు 16 గంటలు చదివించి వారిని రాచి రంపాన పెట్టాలా అని స్వచ్చంద సంస్థల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న వరుస ఆత్మహత్యలతో రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యాబోధన విషయమై ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలని 2020 ఆగష్టులో కొన్ని నిబంధనలు విడుదల చేసాయి. అయితే అవి ఎంతవరకు అమలు అవుతున్నాయన్నదానిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి నియంత్రణ, నిఘా లేదు. ఉదాహరణకు కోవిడ్ సమయంలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు ఉదయం 4 గంటల నుండి స్టడీ అవర్ లేక క్లాసులు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు అప్రతిహతంగా ఆన్లైన్ విధానంలోనే సాగాయి. అన్ని గంటలు కంప్యూటర్ ముందు కూర్చోలేక విద్యార్ధులు ఎన్ని అవస్థలు పడ్డారో చెప్పడం కష్టం. రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న విద్యాబోధనపై చక్రపాణి కమిటీ ఈ మే నెలలో తన నివేదిక సమర్పించింది. విద్యారంగం నిపుణులతో చర్చించి తక్షణం ఈ నివేదికను తు చ తప్పక అమలు చేయాలి. అంతేకాకుండా విద్యార్ధులు తమకు నచ్చిన రంగంలో చదువులు చదివి, కెరీర్ ను నిర్మించుకునే స్వేచ్చా, స్వాతంత్రాలు కల్పిస్తే వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాట వేసినవారవుతారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!