– లోన్ యాప్స్ నిర్వాహకులు ఎవరైనా వేధిస్తుంటే నన్ను నేరుగా సంప్రదించండి
– రాజమహేంద్రవరం ఎంపీ భరత్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ఈ మధ్యకాలంలో లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరమని ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయం నుండి ఈ మేరకు మీడియాకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. రుణమిచ్చే వ్యక్తులెవరో తెలియకుండా రుణం తీసుకోవడం ఒక తప్పు అని, ఒక వేళ తీసుకున్నా వేధింపులు తాళలేక మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడం చాలా తప్పన్నారు. ఇటీవల రాజమండ్రిలో యాప్ లోన్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు బలవన్మరణం చేసుకున్నారని, వారి పిల్లలు అనాధలయ్యారన్నారు. అదే విధంగా నిన్నటికి నిన్న శనివారం ధవళేశ్వరంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని..చావు పరిష్కారం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారు. పోలీసు శాఖ సమగ్ర విచారణ చేస్తోందన్నారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా, మనమెవరిమో తెలియకుండా కేవలం ఒక్క ఫోన్ క్లిక్ ద్వారా లోన్ వస్తోందంటే ప్రతీ ఒక్కరూ ఆలోచించాలని, ఈ లోన్ యాప్ అంగీకరించే వారి పర్సనల్ డిటైల్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ వారి సిస్టంలో ఫీడ్ అయిపోతాయని చెప్పారు. పది, ఇరవై రూపాయల నిత్య వడ్డీలతో తీసుకున్నా అసలుకు మరెన్నో రెట్లు వసూలు చేస్తారని తెలిసిందన్నారు. అయినప్పటికీ అసలు అలానే ఉంటుందని, లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ బెదిరింపు కాల్స్ బంగ్లాదేశ్ నుండి వచ్చినట్టు తెలిసిందన్నారు. దయచేసి ఎవరూ లోన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకోవద్దని, ఎవరికైనా అటువంటి బెదిరింపు కాల్స్ వస్తుంటే నేరుగా తనని సంప్రదించ వచ్చునని ఎంపీ భరత్ తెలిపారు.పోలీసులతో మాట్లాడి బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ మార్గాని భరత్ రామ్ భరోసా ఇచ్చారు.