విశ్వంవాయిస్ న్యూస్, మోతుగూడెం:
బూడిదవుతున్న పచ్చదనం🌳 కొరవడిన అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ… ❗️చట్టం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో భారీ జిట్రేగి (రోజ్ వుడ్ )వృక్షాలు తరలిపోతుండడం శోచనీయం. కలప వ్యాపారులు ఇష్టానుసారంగా భారీ వృక్షాలను నరికేస్తూ బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో విలువైన కలప వేరే ప్రాంతాలకు తరలిపోతున్న వైనం.కలప వ్యాపారులు ఎటువంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో కలపను అక్రమంగా తరలిస్తున్నా రు. అంతేకాకుండా అటవీ, ప్రభుత్వ భూముల్లో ఉన్న భారీ వృక్షాలను కూడా గుట్టుచప్పుడుకాకుండా నరికివేస్తూ విలువైన కలపను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. కలప వ్యాపారులకు వారి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో కలప వ్యాపారులు పగటి పూట గ్రామాల్లో చెట్లను నరికి సాయంత్రం కాగానే వాహనాలలో తరలిస్తున్నారు. ఇందులో భాగంగా గోపాలపురం, సిరిసినపల్లి గ్రామాల సమీపంలో ఉన్న టేకు,రోజ్‌ఉడ్, చెట్లను ఇష్టానుసారంగా రంపాలతో కోసేస్తున్నారు. ఈ చెట్లను కోయడానికి రెవెన్యూ, అటవీశాఖ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకనే అక్రమంగా వృక్షాలను నరికేస్తున్నారు. ముఖ్యంగా చింతూరు మండలంలోని కలప అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. ఈ గ్రామాల్లో కలప వ్యాపారులు చెట్లను కోసేస్తున్నా పట్టించుకొనే నాథులు కరువయ్యారు. దీంతో వారి అక్రమ వ్యాపారానికి అడ్డూ అదుపులేకుండా పోయింది.కలప వ్యాపారులు గ్రామాల్లో చెట్లను అక్రమంగా నరికేస్తునట్లు సంబంధిత ప్రజల ద్వారా తెలిసింది.