విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్, జూన్ 2:
“సరిగ్గా ఈరోజుకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యింది. తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం దశాబ్ద ఘోషగా మారింది. ఎందుకంటే విభజన హామీలు నెరవేరలేదు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత పదేళ్లుగా రెండు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదు. మొత్తం మీద ఏపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక్కటే అన్నట్లుగా ఇప్పటివరకు సాగింది. ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్ర విభజన సమస్యలపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలి” అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు అయిన సందర్బంగా స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాలుపైన బుక్ బ్యాంకు లో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిసోర్స్ గ్యాప్ 32వేల 625కోట్లు కేంద్రం భర్తీ చేయాల్సి ఉందని, అయితే 5వేల 617కోట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. పోలవరం 48శాతం మాత్రమే పూర్తయిందని, ఇంకా 52శాతం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ 521కోట్ల 62 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కేంద్రం వెబ్ సైట్ లో పెట్టేసిందని ఆయన వాపోయారు. జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రమే దీన్ని పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రం అడిగితేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామని కేంద్రం లోక సభలో చెప్పిందని, కేంద్రమే ఇచ్చిందని రాష్ట్ర శాసన సభలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఉండవల్లి గుర్తుచేశారు. అసలు అడిగితె ఇచ్చారా, అడగకుండా ఇచ్చారా వంటి అంశాలకు సంబంధించి లిఖిత పూర్వకంగా ఎక్కడా లేకపోవడం వింతగా ఉందన్నారు. ఎపి పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం కేంద్రమే భరించాలని 2017లో అప్పటి రాజ్యసభ సభ్యులు డా. కెవిపి రామచంద్రరావు అమరావతిలో కేసు వేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అఫడవిట్ వేయలేదని, ఇందులో తాను కూడా ఇంప్లిడ్ అయ్యానని ఉండవల్లి ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా డామ్ మొదలవ్వలేదని, ఈలోగానే డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, ఉండవల్లి పేర్కొంటూ దీనికి కారకులైన అధికారులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అయన ప్రశ్నించారు. టీడీపీ, వైసిపి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప కారకులను గుర్తించడంలో ఎందుకు శ్రద్ధ చూపించలేదని అయన వాపోయారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఇక రాష్ట్ర విభజన సందర్బంగా ఇండస్ట్రియల్ డవలప్ మెంట్ ఇన్సిటివ్ లు కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న ఆస్తుల విలువ 2023నాటికి 1,42,601 కోట్ల రూపాయలుగా ఉందని, ఈ విషయంలో ఏపీకి రావాల్సిన 58శాతం వాటాకు సంబంధించిన బకాయిలు ఇంతవరకు రాలేదని ఆయన విచారం వ్యక్తం చేసారు. న్యాయం మనకు రావాల్సిన వాటి గురించి కేంద్రం దగ్గరకు వెళ్లి అడిగేవాళ్ళు లేకుండా పోయారని , గడిచిన రెండు ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయని ఉండవల్లి గుర్తుచేసారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడే ధైర్యం లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీం కోర్టులో తాను వేసిన పిటిషన్ పై జగన్ ప్రభుత్వం అఫడవిట్ వేసినప్పటికీ ఇంతవరకు ముందుకు తీసుకెళ్లలేదని ఆయన అన్నారు. ఇక ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ పదేళ్లు అన్నది ముందుగానే వచ్చేశామని, ఇప్పటివరకు కొనసాగి ఉంటె, పన్నులు వస్తాయన్న కారణంగా మరో పదేళ్లు కొనసాగించమని తెలంగాణ ప్రభుత్వమే కోరేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉండవల్లి చెప్పారు.
ఏపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఉండవల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు, జగన్ వ్యాపారాలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉన్నాయని, ఏపీకి రాలేదని, దీనివల్ల పన్నులు మనకు రావడం లేదని అన్నారు. అలాగే సినిమా పరిశ్రమ కూడా రాలేదని గుర్తుచేశారు. .4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయని ఉండవల్లి గుర్తుచేస్తూ, అధికారంలోకి ఎవరు వచ్చినా ఏపీ విభజన సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు. తెలంగాణ అసెంబ్లీ తరహాలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరగాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కానీ, ఇక్కడ చర్చ కంటే ఎక్కువగా రచ్చ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వం రాష్ట్ర సమస్యలపై దృష్టి సారిస్తుందన్న ఆకాంక్షను ఆయన వ్యక్తపరిచారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున చొరవ చూపిస్తే, ఒక కమిటీ వేసి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల పంపకం, సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
జితేంద్ర ‘ప్రజాభీష్టం’ బుక్ లెట్ ఆవిష్కరణ
వివిధ ప్రజా సమస్యలు, అంశాలకు సంబంధించి రాబోయే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ, రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర రూపొందించిన బుక్ లెట్ ని ఉండవల్లి తొలుత ఆవిష్కరించారు.