VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 8:42 am Posted by : Chandu

విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యం

రాయవరం, East Godavari (VISWAM VOICE DESK):

పసలపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:

పసలపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. జోసఫ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గ్రామానికి చెందిన దాత ద్వారంపూడి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభ కనబరిచే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచిన వారికి మొదటి, రెండో, మూడో ర్యాంకుల ప్రాతిపదికన బహుమతులను దాత ద్వారంపూడి రామచంద్రారెడ్డి అందజేశారు. బహుమతులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా, తోటి విద్యార్థులు వారిని అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇటువంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు మరింత పట్టుదలతో చదివేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.