08:38 AM, 26 Friday February 2021

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలి

◘ వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో , నిరసనలు
◘ మన్యంలో భారత్ బంద్ ప్రశాంతం

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్ని విడనాడాలని కోరుతూ పలువురు వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని మరియు ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగ పోరాటానికి సంఘీభావంగా రైతు కార్మిక ప్రజాసంఘాలు పిలుపు మేరకు భారత్ బంద్ లో భాగంగా మంగళవారం ఎటపాక మండలంలో ర్యాలీలు , రాస్తారోకోలు , నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎటపాక మండలంలో సీపీఎం , సీపీఐ , సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) ఆధ్వర్యంలో మురుమూరు నుండి నెల్లిపాక వరకు బైక్ ర్యాలీ, నెల్లిపాకలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని దుకాణాలు , ప్రభుత్వ , ప్రయివేటు విద్యా సంస్థలు మూతపడగా , వివిధ కార్మిక సంఘాలు స్వచ్చందంగా బందులో పాల్గొని తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వామపక్షాల నేతలు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల పరం చేసే 3 రైతాంగ వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వినాశకర కొత్త చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని స్వామినాథన్ కమీషన్ సూచన ప్రకారం కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కేరళ తరహా రైతు రుణ విమోచన చట్టం చేయాలని జిఓ నెం 22 ఉపసంహరించాలని వ్యవసాయానికి ఉచిత విద్యుత్ యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తే రైతులు కూలీలుగా మారుతారని ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని లేనట్లయితే రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలు తప్పవని కేంద్ర ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కందుకూరి మంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మర్లపాటి నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి ఎలిశాల.నాగరాజు, సీఐటీయూ మండల కార్యదర్శి డేగల.మాధవరావు , పి ఎన్ ఎం జిల్లా నాయకులు ఐ వి, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకా అర్జున్ దొర, ఐద్వా మండల కార్యదర్శి పద్మ ,నాయకులు వాసం రాము, సొందే రామారావు , ఆకిశెట్టి రాము, బుద్దుల భద్రయ్య, సోయం వీరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#