14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
వివరాలు వెల్లడించిన సిఐ పి.దొరరాజు
రాయవరం,విశ్వంవాయిస్ న్యూస్ :
రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసి బస్సును ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మండపేట రూరల్ సి.ఐ పి. దొరరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జూలై 30వ తేదీన కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంద్ర ఆర్టీసీ బస్సు పసలపూడి–మాచవరం రహదారిపై ప్రయాణిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించి, అనంతరం బస్సు డ్రైవర్‌పై దాడి చేయడంతో పాటు బస్సు వైపర్‌ను విరగ్గొట్టి, ముందు అద్దాన్ని ధ్వంసం చేశారని ఈ ఘటనపై బాధిత డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయవరం ఎస్సై డి. సురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా దర్యాప్తులో భాగంగా సోమవారం మాచవరం వంతెన సమీపంలో మాచవరం గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ , అక్కిశెట్టి సాయి సురేష్, సోమేశ్వరం గ్రామానికి చెందిన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి అలియాస్ సతీష్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అనపర్తి జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీఐ పి. దొరరాజు తెలిపారు. ప్రజా రవాణా సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.