VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 6:08 pm Posted by : VISWAM VOICE DAILY

ఆగస్టు 15న కోర్టు ప్రాంగణాల్లో వనమహోత్సవం.

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):

 

పర్యావరణ పరిరక్షణకు న్యాయశాఖ ప్రత్యేక కార్యక్రమం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు న్యాయస్థానాల్లో మొక్కల నాటడం..

ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులు భాగస్వాములు కావాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపు

 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆగస్టు 15న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా న్యాయస్థానాల ప్రాంగణాల్లో ‘వనమహోత్సవం’ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో విస్తృతంగా మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలోని కోర్టు సముదాయాలు, వివిధ న్యాయస్థానాల ప్రాంగణాలు, న్యాయమూర్తుల నివాస గృహాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, కొత్తపేట, ఆలమూరు, ప్రత్తిపాడు, ముమ్మిడివరం, తుని, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల ప్రాంతాల్లో ఈ వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు.