*ఇంటింటికీ యోగా… సంపూర్ణ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం*
*టెక్నాలజీకి ఆధ్యాత్మికను అనుసంధానిస్తే అన్‌స్టాపబుల్*
*ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని అమలు*
*భారత శక్తిని ప్రపంచానికి చాటుతున్న ప్రధాని సేవలు శ్లాఘనీయం*
*తిరుపతిలో యోగాంధ్ర-2027*
*అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*
*బాబా రామ్‌దేవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ యోగాసనాలు*
*వివిధ క్లిష్టమైన ఆసనాలను సునాయాసంగా వేసిన సీఎం*
*సమాజ హితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి*
*అమరావతి, విశ్వం వాయిస్ న్యూస్ జూన్ 21:* ఇంటింటికీ యోగా… సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో యోగా మందిరాలను నిర్మిస్తామని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆదివారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సీఎం చంద్రబాబు యోగాంధ్ర లోగో ఉన్న చొక్కా ధరించి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా వివిధ ఆసనాలు వేయించారు. ప్రాణాయామం, అనులోమ, విలోమ పద్దతుల్లో సీఎం చంద్రబాబు యోగాభ్యాసం చేశారు. అలాగే యోగాభ్యాసంలో భాగంగా వివిధ ఆసనాలను సీఎం చంద్రబాబు సునాయాసంగా వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజీఎం స్టేడియం విద్యార్థి, యువతీ, యువకులతో నిండిపోయింది. వివిధ స్థాయిల్లోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఉదయం ఐదు గంటల నుంచి రామ్ దేవ్ బాబా ప్రజలతో యోగ సాధన చేయించారు. సమాజహితం కోసం బాధ్యతతో వ్యవహరిస్తామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేం. యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ప్రధాని మోదీ ప్రపంచానికి భారతదేశ శక్తిని చాటుతున్నారు… దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు. ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురు… ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారతదేశం. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానే. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్ దేవ్ బాబా కృషి అమోఘం. సాంకేతికత.. ఆధ్యాత్మికత కాంబినేషన్ తో వెళ్తేనే భవిష్యత్. ఆథ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం. ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
*యోగా కోసం ప్రత్యేక పోర్టల్*
“యోగాంధ్ర-2025లో విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించాం. ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం. 1.33 లక్షల సెంటర్లల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారు. ఇంటింటికి యోగా చేరాలి… ప్రజారోగ్యం బాగుండాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తాం. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తాం. స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం. యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. జంక్ ఫుడ్ వద్దు.. ఫాస్ట్ ఫుడ్‌ను దూరంగా పెడదాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం… రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరి చేరదు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతాం. సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం. వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తాం… సంజీవనిలో యోగాను చేరుస్తాం. రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు. నేను 30 ఏళ్ల నుంచి యోగా అభ్యాసం చేస్తాను. ప్రతి రోజూ బిజీగా ఉంటాను.. రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ యోగాసాధన చేయడం వల్ల అన్ని ఇబ్బందులను అధిగమించగలుగుతున్నాను. టెక్నాలజీకి ఆధ్యాత్మికతత తోడైతే అన్ స్టాపబుల్. నేటి తరం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నట్టే… యోగాను.. ఆధ్యాత్మికతను అడాప్ట్ చేసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 1.07 కోట్లమంది పౌరులు, 2.5 లక్షల మంది శిక్షకులు యోగాలో పాల్గొన్నందుకు రెండు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కాయి…వాటిని అధికారులు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాస వర్మ, యోగా-నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణరాజు, మంత్రి సత్యకుమార్ యాదవ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, సవిత పాల్గొన్నారు.