VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 1:05 pm Posted by : Chandu

అధికారుల నిర్లక్ష్యంపై వి.ఎస్.ఎమ్ యూత్ నిరసన

మండలం (రాయవరం), East Godavari (VISWAM VOICE DESK):

 

 

సొంత ఖర్చులతో ప్రధాన రహదారి గుంతల పూడ్చి సహాయం 

 

హర్షం వ్యక్తం చేసిన స్ధానికులు

 

మండల కేంద్రమైన రాయవరంలో ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు, పాలకవర్గాలు స్పందించకపోవడంపై వి.ఎస్.ఎమ్ యూత్ సభ్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అధికారుల కోసం ఎదురుచూడకుండా తమ సొంత ఖర్చులతో రహదారిపై పలుచోట్ల ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. గత కొద్దికాలంగా ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారిన సమస్యపై అధికారులు స్పందించకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి సొంత ఖర్చులతో గుంతలను పూడ్చిన వి.ఎస్.ఎమ్ యూత్‌ను స్థానికులు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రజలకు రహదారి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.