విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, బెంగళూరు:
కర్ణాటకలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండనుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర మంత్రి ఆడియో లీక్ కావటం కలకలం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ‘తాము ప్రభుత్వాన్ని నడపటం లేదు.. మేనేజ్ చేస్తున్నాం’ అంటూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహరాలశాఖ మంత్రి జేసీ మధుస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు బొమ్మై. ఆ వ్యాఖ్యలు వేరే ఉద్దేశంతో చేసినవిగా సీఎం పేర్కొన్నారు.
కాగా మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలతో కొందరు మంత్రులు విమర్శలు గుప్పించారు. పదవి నుంచి మధుస్వామి తప్పుకోవాలని ఉద్యానవన శాఖ మంత్రి మునిరత్నం సూచించారు. ఈ క్రమంలో మంత్రులతో తాను మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. మధుస్వామిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన(మధుస్వామి) వేరే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో మాట్లాడతాను. తన ఉద్దేశం వేరు. ఆ మాటలను తప్పుడు ఉద్దేశంతో చూడకూడదు. పరిస్థితులు సరిగానే ఉన్నాయి. ఎలాంటి సమస్య లేదు. ఇతర మంత్రులతోనూ మాట్లాడతాను.’ అని పేర్కొన్నారు.
కర్ణాటక మంత్రి మధుస్వామి, చెన్నపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త భాస్కర్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో శనివారం వైరల్‌గా మారింది. రైతుల సమస్యలను సూచిస్తూ కోఆపరేటివ్ బ్యాంకుపై భాస్కర్ ఫిర్యాదు చేసిన క్రమంలో..‘ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపటం లేదు, కేవలం మేనేజ్ చేస్తున్నాం. మరో 7-8 నెలలు లాక్కొస్తాం.’ అని మధుస్వామి పేర్కొన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పు చేసేందుకు బీజేపీ ఆలోచిస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఆడియో లీక్ కలకలం సృష్టిస్తోంది.