విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తాడేపల్లి:
-మీడియాతో మాట్లాడుతున్న గుంటూరు, పల్నాడు రీజినల్ కోఆర్డినేటర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
– పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారు
– జగన్ సీఎం అయిన తర్వాతే రైతులు గుర్తుకొచ్చారా
– బాబు హయాంలో రైతులు చనిపోతే ఎందుకు మాట్లాడలేదు
– చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాడు
– ఆయన చెప్పే కబుర్లను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు
– గుంటూరు, పల్నాడు రీజినల్ కోఆర్డినేటర్ కొడాలి నాని
తాడేపల్లి, ఏప్రిల్ 27: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతులు గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు, పల్నాడు రీజినల్ కోఆర్డినేటర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు అజెండా లేదని, ఆయన జెండా వేరని అన్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ రైతులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతో మంది రైతులు చనిపోయారని, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఓట్లు అన్నీ జగన్ కు వ్యతిరేకంగా పడాలని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతున్నాడన్నారు. దీనికి తానే నాయకత్వం వహిస్తానని బహిరంగ సభలో ప్రకటించాడన్నారు. కోడిగుడ్డుకు ఈకలు పీకాలి కాబట్టి ఏదో ఒక పనికిరాని, పనికొచ్చే అంశాన్ని చూసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అని, ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. చంద్రబాబు నీతులు చెప్పడానికే పనికివస్తాడని అన్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాడని, ఆయన చెప్పే పనికిమాలిన కబుర్లను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని కొడాలి నాని ఎద్దేవా చేశారు.