– వేసవి, క్రీడా శిక్షణ శిబిరం-2022 ను ప్రారంభించిన
ఎంపీ గీత, కలెక్టర్ శుక్లా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అన్ని రకాల క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం డీఎస్ఏ మైదానంలో స్థానిక ఎంపీ వంగా గీత.. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నగర మేయర్ సుంకర శివ ప్రసన్న, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సెట్రాజ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు తదితరులతో కలిసి వేసవి క్రీడా శిక్షణ శిబిరం-2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ డీఎస్ఏ మైదానంతో తనకెంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డీఎస్ఏ మైదానంలో ఏడున్నర కోట్ల రూపాయలతో ఆస్ట్రో టర్ఫ్ హాకీ కోర్టును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కోవిడ్ మనల్ని ప్రకృతి నుంచి దూరం చేసిందని.. ఇప్పుడు పరిస్థితి కుదుటపడి ఇంత మంచి వాతావరణంలో క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
*అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… కలెక్టర్*
కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ శారీరక, మానసిక వికాసానికి క్రీడలు చాలా ముఖ్యమని.. క్రీడల్లో భాగస్వామ్యం ద్వారా చదువుల్లోనూ బాగా రాణించవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఈ శిబిరాలను నిర్వహించుకోలేకపోయామని.. ఇప్పుడు వీటిని ప్రారంభినందుకు ఆనందంగా ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా డీఎస్ఏ ప్రాంగణంలో క్రీడా సౌకర్యాలు ఉన్నాయని.. వీటిని సద్వినియోం చేసుకోవాలని పాఠశాలల విద్యార్థులకు సూచించారు. హాకీ గ్రౌండ్‌తో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ పొందేందుకు అత్యుత్తమ వసతులతో పాటు ప్రతిభ ఉన్న కోచ్‌లు ఉన్నారన్నారు. ఈ క్రీడా ప్రాంగణం నుంచి చాలామంది నేషనల్స్, ఇంటర్నేషనల్స్‌కు వెళ్లారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మే 7 నుంచి 31వ తేదీ వరకు 25 క్రీడాంశాల్లో 89 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తమ కుమారుడిని కూడా జిమ్నాస్టిక్స్ క్రీడలో శిక్షణకు చేర్చినట్లు తెలిపారు. త్వరలోనే స్విమ్మింగ్‌పూల్‌ను తెరిచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. బాలబాలికల్లో శారీరక సామర్థ్యం పెంపొందించేందుకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాప్, డీఎస్ఏ శిక్షకులు, పీఈటీ/పీడీలు, సీనియర్ క్రీడాకారులు ఈ శిబిరాలను నిర్వహిస్తారని వెల్లడించారు. చిన్నారులు ఫోన్లు, ట్యాబ్స్‌తో సమయం గడపకుండా క్రీడా మైదానాల్లో ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, వివిధ క్రీడల కోచ్‌లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.