– రక్షణ విచారణకు కలెక్టర్ మాధవిలత ఆదేశం
– నివేదిక సమర్పించిన కొవ్వూరు తాసిల్దార్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం ,విశ్వం వాయిస్:
కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో రైతు భరోసా కేంద్రంను రామాలయంలో నిర్వహించుచున్నారే కథనం పూర్తి అవాస్తవం అని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై సమగ్ర నివేదిక సమర్పించిన కొవ్వూరు తహశీల్దార్ ప్రస్తుతం తోగుమ్మి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్వహించుచున్న భవనం 1970వ సంవత్సరంలో తోగుమ్మి గ్రామంలోని మద్దిపాటి పాపయ్య గారి పేరున వారి కుటుంబ సభ్యులచే నిర్మించి ఆ భవనంపై “రామాలయం అనియూ మరియు మద్దిపాటి పాపయ్య “ భవనం యొక్క పేరుగా లిఖించియున్నారు. సదరు భవనంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి దేవుడు విగ్రహములు పెట్టియుండలేదని, ప్రస్తుతం కూడా లేవని నివేదిక ఇచ్చియున్నారు. గ్రామ ప్రజలు తోగుమ్మి గ్రామంలో ఏమైనా అగ్ని ప్రమాదములుగాని, ఎవరైనా కొత్తగా ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు ఈ భవనంను ఉపయోగించుకొనుటకు వాడుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ భవనం సుమారు 5 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న భవనాన్ని మద్దిపాటి పాపయ్య కుటుంబ సభ్యలు సుమారు లక్ష రూపాయలతో బాగు చేయించిన తరువాత భవనమును రైతు భరోసా కేంద్రముగా వారి అంగీకారంతో 2019 నుండి తోగుమ్మి గ్రామములో రైతుల సౌకర్యార్ధం ఉపయోగించుచున్నారు. తదుపరి ఇప్పటివరకు సదరు భవనంలో రైతు భరోసా కేంద్రం నిర్వహించుటకు సంబంధించి ఎటువంటి అభ్యంతరములు వచ్చియుండలేదని తెలియవచ్చినది. పై విషయముల దృష్ట్యా, తోగుమ్మి గ్రామంలో రామాలయంలో రైతు భరోసా కేంద్రము అని సోషల్ మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదని, ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసినా, ప్రోత్సహించినా అటువంటి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.