[ad_1]
posted on Oct 18, 2024 11:17AM
ఆంధ్రప్రదేశ్ లో ఇక వైసీపీ అవసరం ఏ మాత్రం లేదంటున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. వైసీపీ అధినేత, సొంత అన్న అయిన జగన్ కు నోరెత్తే అవకాశం, అవసరం లేకుండా చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలసిందే. వైసీపీ అధికారం కోల్పోయి ఐదు నెలలైంది. అధికారంలో ఉన్నంత కాలం సందర్భం ఉన్నా లేకపోయినా ఇష్టారీతిగా ప్రతిపక్ష నేతలపై బూతులతో విరుచుకుపడడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు ఇప్పడు నోరెత్తడానికి భయపడుతున్నారు. అసలు బయటకు రావడానికే జంకుతున్నారు.
ఈ నాలుగు నెలల కాలంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు బహిరంగంగా బయటకు వచ్చిన సందర్భాలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన దాదాపు అందరూ కూడా ఇప్పుడు పబ్లిక్ లో ముఖం చూపడానికి వెరుస్తున్నారు. ఎన్నికలలో వైసీపీ ఎటూ ప్రతిపక్ష హోదా కోల్పో యింది. కానీ ఒక రాజకీయ పార్టీగా కూడా ఆ పార్టీని జనం గుర్తించడం లేదు. దీంతో ఏపీలో విపక్షం అన్నదే లేకుండా పోయింది. అయితే ఆ లోటును నేను తీరుస్తానంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఇక ఉనికి మాత్రంగా కూడా ఉండే అవకాశం లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ఆ లోటు తెలయకుండా రాష్ట్రమంతా కలియదిరుగుతూ ఏక కాలంలో ఇటు ప్రభుత్వంపై, అటు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా అక్రమాలు, అవినీతి, దాడులతో విరుచుకుపడిన ఆ పార్టీ నేతలందరూ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగువెలిగిన సజ్జల సహా ఆ పార్టీలో నోరు, పేరు ఉన్న నేతలంతా ఇప్పుడు అరెస్టు భయంతో వణికి పోతున్నారు. పారిపోవడమో, కోర్టుల నుంచి అరెస్టు కాకుండా తెచ్చుకున్న రక్షణతోనే బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అందుకే ఆ పార్టీ అధినేత జగన్ సహా నాయకులెవరూ రాజకీయంగా క్రియాశీలంగా ఉండేందుకు సుముఖంగా లేరు. జగన్ అయితే బెంగళూరు నుంచి రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు.
ఉచిత ఇసుక విధానం సహా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ఆరోపణలు వస్తున్నా.. ఎవరూ వాటిని హైలైట్ చేసి ప్రజలలోకి వచ్చేందుకు రెడీగా లేదు. అయితే ఇక్కడే షర్మిల అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రశ్నలు సంధిస్తూనే.. జగన్ హయాంలోని అరాచకాలను, అక్రమాలను ఎత్తి చూపుతున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గట్టిగా కసరత్తు చేస్తున్నారు.
ఇటీవల బెజవాడను వరదలు ముంచెత్తినప్పుడు వరద బాధితులకు అండగా నిలవడంలో వైసీపీ అధినేత కంటే ముందున్నారు. జగన్ కంటే ముందు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ప్రభుత్వ సాయం సత్వరమే అందాలన్న డిమాండ్ చేయడమే కాకుండా, మేన్ మేడ్ ఫ్లడ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గట్టిగా తిప్పి కొట్టారు. మెల్లిమెల్లిగా రాష్ట్రంలో వైసీపీ ప్లేస్ ను ఆక్రమించడమే లక్ష్యంగా షర్మిల అడుగులు వేస్తున్నారు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారానే ఇప్పటి వరకూ యాక్టివ్ గా కనిపించిన షర్మిల ఇప్పుడు బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలోకి చేరికలపై దృష్టి పెట్టారు. వైఎస్ తో సాన్నిహిత్యం ఉన్న నేతలతో టచ్ లోకి వెడుతూ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఆమె ప్రయత్నాలు ఫలిస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలకు షర్మిల ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ బహిరంగ సభలకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించి, వారి సమక్షంలో వైఎస్ మరణం తరువాత వివిధ కారణా లతో వేరే వేరే పార్టీలలోకి వెళ్లిన సీనియర్ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పాలన్న వ్యూహంతో షర్మిల ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఇంత వరకూ ఎన్నడూ కాంగ్రెస్ లో ఈ స్థాయి సందడి కనిపించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు. ఇక రాష్ట్రంలో మూడు భారీ బహిరంగ సభలతో కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుందన్న సందేశాన్ని ఇవ్వడం ద్వారా జగన్ పార్టీ వైపు జనం చూడాల్సిన అవసరం లేకుండా చేయడమే షర్మిల వ్యూహంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[ad_2]
Source link