విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
శారీరక, మానసిక దృఢత్వ ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకునేందుకు సైక్లింగ్ ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని (World Bicycle Day) పురస్కరించుకొని స్థానిక స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాజాట్యాంక్-వివేకానంద పార్క్ వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీని కలెక్టర్ కృతికా శుక్లా.. నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న, కుడా ఛైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్, అదనవు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైకిల్ వాడకం, సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాకినాడలో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నాటి కార్యక్రమంలో చిన్నారులు, యువత, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, సైక్లింగ్ ఔత్సాహికులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. ఫిట్నెస్ పెంపొందించుకోవడానికి.. అదేవిధంగా కాకినాడను కాలుష్య రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి సైకిల్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, డీఎస్ఏ చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ ఆఫీసర్ పి.అమృతేశ్, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సైక్లింగ్ ఔత్సాహికులు పాల్గొన్నారు.