—– పునరావాస కేంద్రాలకు ప్రజల్ని తరలించాలి
విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తక్షణమే తరలించాలని ఆయా కేంద్రాల్లో వారికి సకల సౌకర్యాలు కల్పించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్ల అధికారులను ఆదేశించారు. వైనతేయ నది తీరాన ఉన్న వరద ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్ గురువారం పర్యటించారు .బి దొడ్డవరం ,అప్పనపల్లి, పెదపట్నం లంక , పెదపట్నం గ్రామాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు. భద్రాచలం, ధవలేశ్వరం వద్ద రెండవ ప్రమాదం హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో కోనసీమ జిల్లాలో వరద తాకిడి పెరిగే అవకాశం ఉందని దానికి అనుగుణంగా అధికారులు సిద్ధం కావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పునరావాస కేంద్రాల్లో వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బి. దొడ్డవరం గ్రామంలో ఉన్న పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.గ్రామ జనాభా ఎంత ఉంది అనే దానిపై ఆరా తీసి ,ప్రజలు ఇబ్బందులు పడకుండా అదనంగా మరో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని త్రాగునీరు, బోజన వసతికి కావాల్సిన ఏర్పాట్లు దగ్గరుండి చూడాలని అధికారులకి సూచించారు . అదే విధంగా తమ గ్రామంలో ప్రతి ఏటా వరద ఉధృతి వల్ల సారవంతమైన భూములు,కొబ్బరి తోటలు నదికోతకి గురవ్వడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని , నష్ట నివారణ చర్యల్లో భాగంగా గ్రోయన్లు, రివిట్మెంట్లు, నిర్మించాలని గతంలోనే తమకు వినతిపత్రాలు అందించామనీ, తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని సర్పంచ్ చెల్లుబోయిన రామ శివ సుబ్రమణ్యం మరోసారి కలెక్టర్ హిమాన్ష్ శుక్లాను కోరారు. దీనికి కలెక్టరు స్పందిస్తూ …బి. దొడ్డవరం నదీతీర ప్రాంతం వెంబడి గ్రోయన్లు, రివిట్మెంట్లు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి నివేదిక సమర్పించామని, త్వరలోనే నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉందని , వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడతామని కలెక్టర్ హిమన్సు శుక్లా తెలిపారని సర్పంచ్ చెల్లుబోయిన రామ శివ సుబ్రమణ్యం మీడియాకి వెల్లడించారు.వరద తీవ్రత తగ్గేవరకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికంగానే అందుబాటులో ఉంటూ ప్రజలకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని సూచనలు జారీ చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ,మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆయన వెంట ఆర్డీవో వసంత రాయుడు, తహసిల్దార్ రియాజ్ హుస్సేన్, సెక్రెటరీ పట్టిలిగం, రెవెన్యూ సిబ్బంది, సచివాలయం సిబ్బంది,స్థానిక నాయకులు వాకపల్లి వీరాస్వామి, బోలిశెట్టి శివ,బద్దే రామకృష్ణ, తదితరులు ఉన్నారు.