ఈ ఇన్ఫెక్షన్లు రావడం గుర్తించాం
– కల్చర్ పరీక్ష చేస్తే కారణం తెలుస్తుంది
విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
ఇటీవల కాలంలో చాలామందికి ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు గుర్తించామని స్థానిక గోరక్షణ పేటలోని మారుతి ఆసుపత్రి అధినేత డాక్టర్ శిరికి అజయ్ కుమార్ చెప్పారు.ఈ సీజనులో ఆరోగ్య సమస్యలతో తమ ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గమనించామని తెలిపారు. ఇది ఎందుకు వస్తుందనేది పూర్తిగా చెప్పలేమని,కాని చికెన్ తిన్న తరువాత కొందరిలో ఇలా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు గుర్తించామన్నారు.చాలా రకాల బాక్టీరియా గుర్తించినట్లు డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు.ఇటీవల ప్రజలు తరచుగా జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని, వైరల్ ఫీవర్ బారిన ఎక్కువ మంది పడుతున్నారని, అలాగే డెంగీ, మలేరియా తో ఇబ్బంది పడుతున్నారని వివరించారు.అయితే యూరినరీ ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేయవద్దని,ఇది కిడ్నీ సమస్యలకు దారి తీస్తుందని చెప్పారు.ఇటువంటి వాటికి సొంత వైద్యం చేసుకోవద్దని, గూగుల్ లో వెతకవద్దని,ఎవరో చెప్పారని యాంటీ బయోటిక్స్ అసలు వాడవద్దని హితవు పలికారు.వైద్యుడ్ని సంప్రదించి యూరిన్ కు సంబంధించి కల్చర్ టెస్టు చేయించుకుంటే కారణం తెలుస్తుందని, అప్పుడు తగిన మెడిసిన్ ఇవ్వవచ్చని డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సొంత వైద్యం చేసుకుని మరిన్ని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచించారు.