ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ
ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించడంతో ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతున్న నేపథ్యంలో, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూను ఆటో కార్మికుల యూనియన్ ప్రతినిధులు మంగళవారం రావులమ్మనగర్‌లోని స్థానిక టిడిపి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు.ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునే చర్యలు తీసుకోవాలి. 40 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయాలి. చదువుకున్న ఆటో కార్మికులకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలి వంటి పలు డిమాండ్లు ఉంచినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. ఉచిత బస్సు సౌకర్యం ప్రకటించినప్పుడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో కార్మికులకు సంవత్సరానికి ₹15,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అదనంగా, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో 1700 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం అందిస్తాం. ప్రతి డ్రైవర్‌కు ఇన్సూరెన్స్ కల్పించేందుకు ప్రీమియం చెల్లిస్తామని అలాగే అర్హులైన వారికి మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ రుణంతో గృహనిర్మాణం, ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాను అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఎస్. అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, భూపాలపట్నం ప్రసాద్, దేవరపల్లి మూర్తి, బొల్లం రెడ్డి రామకృష్ణ, రాయి సాయి, బద్ది సురేష్, వేములకొండ జోగారావు, పీల మహేష్, గల్లా రాము, యర్రంశెట్టి మణికంఠతో పాటు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

