రాజుపాలెం నుండి రామచంద్రపురం మార్గంలో నిర్లక్ష్య పరిస్థితి
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం టు రామచంద్రపురం మార్గంలో వాహనదారులు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ ప్రధాన రహదారి రాజుపాలెం నుండి వీరవరం, తామరాడ, గోనేడ, రామవరం గ్రామాల మీదుగా రామచంద్రపురం వెళ్లే దారిగా ఉపయోగపడుతోంది. ప్రతీరోజూ పలు ఆటోలు, కార్లు, బస్సులు, స్కూల్ వాహనాలు ఈ రహదారిపై వెదజల్లుతున్నాయి.అయితే ఇటీవల కాలంలో ఈ రహదారి దారులపై తీవ్ర నిర్లక్ష్యం కనబడుతోంది. రహదారి ఇరువైపులా పశువులను పొడవాటి తాళ్లతో కట్టి, ఆ జంతువులను రోడ్డుపైకి వదిలేస్తుండటం తారాస్థాయికి చేరింది. ఈ జంతువులు రోడ్డుపై అడ్డుగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. హఠాత్తుగా ఆవు, గేదె వంటి పెద్దపెద్ద జంతువులు వాహనాల ముందుకు వచ్చేయడం వలన ప్రమాదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడుతోంది.ఇప్పటికే ఈ మార్గంపై ప్రయాణం చేయడం ప్రజలకు సవాల్‌గా మారింది. “పట్టపగలే వెళ్తే నరకాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఉంటుంది” అని ప్రయాణికులు వాపోతున్నారు. చిరుచినుకే చాలు, ఈ రహదారి కచ్చితంగా నరకప్రాయంగా మారిపోతుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి నిర్మాణం మొదలైంది. కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం దీనిని పశువుల ఆశ్రయంగా మలచేశారు అన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా ఏర్పడింది.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు మోక్షం పొందదు” అని ప్రజలు బాహాటంగానే కామెంట్లు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సంబంధిత అధికారుల జోక్యం అవసరం. పశువులను నిర్లక్ష్యంగా రోడ్డుపై వదలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.