వైసీపీ అసత్య ప్రసారాలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయని జగ్గంపేట ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జగ్గంపేట టిడిపి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మహిళలకు స్త్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బస్సు పథకం ప్రారంభమైన మూడు రోజుల్లోనే విఫలమైందని వైసీపీ ఆరోపించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు ప్రచురించడం నిరాధారమని స్పష్టం చేశారు.
గోకవరం డిపో పరిధిలో ఉన్న 54 బస్సుల్లో 42 బస్సుల్లో ఉచిత పథకం అమలులో ఉందని తెలిపారు. కొత్త పథకాలలో ప్రారంభ దశలో కొంతమేర మార్పులు సహజమని, ప్రతిపక్షం అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, మహిళలకు ఇది ఆర్థిక భరోసా ఇస్తోందని అన్నారు.ఉచిత బస్సు పథకం వల్ల కొంతమేర ఆటో కార్మికులకు ఇబ్బంది కలిగిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, వారికి అండగా నిలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే కమిటీ నివేదిక ఆధారంగా ఆటో కార్మికుల కోసం మేలైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతవరకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 2,000 మంది ఆటో కార్మికులకు 25 కేజీల చొప్పున బియ్యం అందజేసి సహాయం చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి పలు సంక్షేమ పథకాలు సాధించారని చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షం వక్రీకరించి, లోకేష్ ఢిల్లీ పెద్దలను జగన్ అరెస్టు కోసం కలుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.జగన్ అరెస్టు చేయించేందుకు మాకు అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది. జగన్‌ను ఎవరైతే అరెస్టు చేయాలో వాళ్లే త్వరలో అరెస్టు చేస్తారు అని నెహ్రూ వ్యాఖ్యానించారు.గతంలో జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తన కేసుల నుండి తప్పించుకోవడానికే వెళ్లారని ప్రజలకు తెలిసిందేనని తెలిపారు. లోకేష్ ఢిల్లీకి వెళ్లే ప్రతి సారి ఎవరిని కలుస్తున్నారో, ఏం సాధించారో కులంకషంగా మీడియాకు వివరించడం జరుగుతోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్.వి.ఎస్. అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, టిడిపి మండల అధ్యక్షులు జీను మణిబాబు (జగ్గంపేట), మారిశెట్టి భద్రం (అభివృద్ధి కమిటీ డైరెక్టర్), కందుల చిట్టిబాబు (జెడ్ రాగంపేట సర్పంచ్) తదితరులు పాల్గొన్నారు.

