ఐసీడీఎస్ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మి
కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాజెక్ట్ పరిధిలోని 182 అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుండి 5 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ఆల్బండాజోల్ 400 మిల్లీగ్రామ్ మాత్రలను వేయడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం జగ్గంపేట శెట్టిబలిజపేట అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమావేశాన్ని సీడీపీఓ ఎం. పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మి హాజరై మాట్లాడుతూ
నులి పురుగులు ఉన్న పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారని తెలిపారు. వీటిని నివారించడానికి డీవార్మింగ్‌తో పాటు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని సూచించారు.
ఆమె వివరించిన సూచనలు:
• చేతి గోళ్లను చిన్నగా కత్తిరించుకోవాలి.
• చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
• కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.
• వండిన ఆహారాన్ని మూతపెట్టి ఉంచాలి.
• కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి వాడాలి.
• ఏదైనా తిన్న తరువాత, టాయిలెట్ వాడిన తరువాత చేతులు సబ్బుతో కడగాలి.
• పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
అంగన్వాడీ కేంద్రాల్లో 1–3 సంవత్సరాల చిన్నారులకు ఆల్బండాజోల్ 400 మి.గ్రా మాత్ర సగం ముక్కను పౌడర్ చేసి తినిపించగా, 3–5 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను నేరుగా మింగేలా ఇచ్చారు. ప్రతి చిన్నారికి మందు అందజేశారు. మాత్రను సరిగా నమిలి తింటేనే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.అనారోగ్యం కారణంగా మందు వేయలేని చిన్నారులకు ఆగస్టు 20న జరగనున్న మాప్-అప్ డేలో ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, అంగన్వాడీ టీచర్ సీత, చెల్లయమ్మ, ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.