జగ్గంపేట రావులమ్మ నగర్ లోనిగల భాష్యం పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులచే ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల గోపికమ్మ, శ్రీకృష్ణుని వేషధారణలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కుసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఇది హిందువులకు ముఖ్యమైన పండుగని, శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారన్నారు. కృష్ణాష్టమి పండుగ భక్తి, ప్రేమ మరియు ఆధ్యాత్మికతలకు ప్రతీక అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇంచార్జ్ గోవిందరాజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.