పట్టించుకోని అధికార యంత్రాంగం …రోడ్ వేయండి మహా ప్రభు…
జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం గ్రామం నుండి రాజుపాలెం వరకు వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాల పూటగా మారింది. గత ఐదు సంవత్సరాలుగా మరమ్మతులు చేసి నిర్లక్ష్యంగా వదిలి వేయడం తో రహదారి పరిస్థితి నరకప్రాయంగా మారింది. వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోతూ, వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.ప్రజల నిత్యజీవితానికి చుట్టుపక్కల గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది .ఈ రహదారిపై ప్రతీ రోజు వందలాది మంది రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణిస్తున్నారు. రామవరం, గోనెడ, రామచంద్రపురం, వీరవరం, రాజుపాలెం లాంటి కీలక గ్రామాలకు అనుసంధాన మార్గం ఇదే. పంటల రవాణా, వ్యాపార కార్యకలాపాలు, అత్యవసర వైద్యం ప్రయాణాలు అన్నీ ఈ రోడ్డుపై ఆధారపడి ఉన్నాయి. కానీ, రహదారి లోతైన గుంతలతో ప్రయాణం ప్రతి రోజు ఒక సాహసయాత్రలా మారుతుంది .ప్రభుత్వాల తాత్సారమే కారణం అని ఇక్కడ గ్రామస్థులు వాపోతున్నారు .గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనా, నిధుల కొరత, రోడ్ కాంట్రాక్టర్ల కి బిల్ అవ్వకపోవడం పలు కారణాలతో రోడ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. “ఒక్కసారి నడవగలిగితే చూడండి, ఇదే మా పరిస్థితి” అంటూ ఓ వృద్ధ రైతు వేదన వ్యక్తం చేశాడు.ఈ రహదారిపై ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కేవలం వాహనాలు కాకుండా, ప్రయాణికులు కూడా గాయాల పాలవుతున్నారు. “పిల్లలు స్కూల్ బస్సులో వెళ్తుంటే గుండె గుబురుగొడుతుంది” అని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.ఇక సంయమనం కోల్పోతున్న గ్రామస్థులు, యువజన సంఘాలు, రైతు సంఘాలు రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. రహదారి పునరుద్ధరణ చేపట్టకపోతే, రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళనలు, రాస్తారోకో, కార్యక్రమాలు చేపడతామని పలువురు హెచ్చరించసాగరు. ఈ రహదారి మరమ్మతులను తక్షణమే ప్రారంభించాలి అవసరమైన నిధులను మంజూరు చేయాలి పనులపై ప్రత్యేక అధికారిని నియమించాలి.ప్రధాన ప్రమాదకర గుంతలను వెంటనే పూడ్చాలని చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.