సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కూటమి పాలనలో అమలవుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో సంతృప్తి కనబడుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. శనివారం జగ్గంపేట మర్రిముక్క వీధిలో జగ్గంపేట టౌన్ టిడిపి అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ రాష్ట్రంలోనూ, నియోజకవర్గంలోనూ జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైసీపీలా తమది పరదాల పాలన కాదని, ప్రజాపాలన అని తెలిపారు. జగన్ ప్రజల్లోకి రావడానికే భయపడేవారని, పరదాలు కట్టుకుతిరిగేవారని, నేటి ప్రజాపాలనలో మన ముఖ్యమంత్రి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. నాడు అరాచకం రాజ్యమేలితే నేడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందన్నారు. జగ్గంపేటకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాబోయే నాలుగు సంవత్సరాల్లో జగ్గంపేట పట్టణానికి శుద్ధి చేసిన మంచినీరు, రైతులకు సాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, వాకింగ్ ట్రాకు, పట్టణ యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు కూడా స్థాపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, కొండ్రోతు శ్రీను, కింగంరమణ, సుంకర బ్రదర్స్,సందక బ్రదర్స్, మారిశెట్టి గంగ, మర్రి మొక్క వీధి, సంఘం వీధి, పల్లపు వీధి కూటమి నాయకులు పాల్గొన్నారు.