ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రధాన ధ్యేయంగా తీసుకుని “శక్తి యాప్” ను ప్రయోగించిందని, ప్రతి మహిళకు అది రక్షణ కవచంగా ఉండాలని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం హై స్కూల్ లో జరిగిన అవగాహన కార్యక్రమంలో పోలీసు అధికారులు తెలిపారు. శక్తి యాప్‌లోని ‘సేఫ్ ట్రావెల్’, ‘షేక్ ట్రిగ్గర్’, ‘గివ్ ఏ కంప్లైంట్’, ‘కౌన్సిలింగ్’, ‘నైట్ షెల్టర్స్’ వంటి ఫీచర్ల గురించి వివరించారు.
ఈ సందర్భంగా మహిళలకు ఇది ఒక పాశుపతాస్త్రం లాంటిదని పేర్కొంటూ, అత్యవసర పరిస్థితుల్లో యాప్‌ను వాడడం ద్వారా పోలీసు సహాయం క్షణాల్లో అందుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా చిన్నారుల భద్రత కోసం కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు.
డ్రగ్స్ నిర్మూలన – ఈగల్ టీం రంగంలోకి:
“డాగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ టీం ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్న నేపథ్యంలో, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి మార్గనిర్దేశం చేయాలని, అన్ని విద్యాసంస్థల వద్ద 10 మంది సభ్యులతో “ఈగల్ కబ్బులు” ఏర్పాటు చేయాలని సూచించారు.డ్రగ్స్ వాడక వల్ల కలిగే మానసిక, శారీరక, సామాజిక నష్టాలను వివరిస్తూ అవగాహన, చికిత్స, మానసిక కౌన్సిలింగ్ అవసరమని తెలిపారు. మెడికల్ షాపులపై కూడా ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు.
సైబర్ నేరాలపై హెచ్చరికలు:
సైబర్ నేరగాళ్ల మాయమాటలకు బలికాకూడదని, అత్యాశ, అశ్రద్ధ వల్లే ఎక్కువ మంది మోసపోతున్నారని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వాణిజ్య ప్రకటనలు, లింకులు, APK ఫైళ్లపై జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ అన్నది చట్టంలో లేదని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయాలంటే 1930 లేదా www.cybercrime.gov.in ఉపయోగించాలని సూచించారు.రోడ్ భద్రతపై పలు సూచనలు:
హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం, మొబైల్ ఫోన్ ఉపయోగం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, 18 సంవత్సరాల లోపు వాహనాలు నడిపితే వాహన యజమానులు శిక్షార్హులని గుర్తు చేశారు. రాత్రివేళ విద్యాసంస్థల ప్రాంగణాల్లోకి ప్రవేశించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్కూలు పరిసరాల్లో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్:
విద్యాసంస్థల 100 గజాల పరిధిలో పాన్ షాపులపై తనిఖీలు నిర్వహించి, పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. “ఈవ్ టీజింగ్”, “ర్యాగింగ్”, “లవ్ ట్రాప్” లాంటి సంఘటనలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటిని అరికట్టేందుకు అధికారులు కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై ఆర్ కె శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ఎస్ డి పి వో పెద్దాపురం శ్రీహరి రాజు, కిర్లంపూడి ఎసై జి.సతీష్, పి ఎస్సై ఎం. రాజా, ప్రిన్సిపాల్ ఎస్. దుర్గాప్రసాద్, ఉపాధ్యాయులు వరహాల బాబు, సుబ్బారావు, విజయరాణి గారు తదితరులు పాల్గొన్నారు.