వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా 80 శాతం రాయితీతో రైతులకు వ్యవసాయ డ్రోన్లను అందిస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర సీ హెచ్ సీ రైతు గ్రూపుకు వ్యవసాయ డ్రోన్‌ను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, వ్యవసాయ పెట్టుబడులను తగ్గించేందుకు, పురుగుమందులు మరియు సూక్ష్మ ఎరువులను సమయానికి పంటలకు పిచికారీ చేయేందుకు డ్రోన్ల వినియోగం అవసరం అని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీ అందిస్తోంది. ప్రతి డ్రోన్ యూనిట్‌కు రూ.9.80 లక్షల ఖర్చు కాగా, రైతు వాటా కేవలం రూ.1.96 లక్షలు మాత్రమేనని, మిగిలిన రూ.8 లక్షలను ప్రభుత్వం భరిస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 875 డ్రోన్ యూనిట్లను మంజూరు చేసినట్టు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కూడిన రైతు గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి, వారికి వ్యవసాయ శాఖ శిక్షణను కూడా అందించిందన్నారు. రైతుల వాటాను బ్యాంకుల ద్వారా రుణంగా అందించి, డ్రోన్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కుంచే రాజా, అడబాల భాస్కరరావు, ఉంగరాల రాము, ఏడీఏ జి. శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్, తవటం వీరభద్రరావు, ఐఓబీ బ్యాంక్ మేనేజర్, సాయికిరణ్, రైతు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.