డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలో గల పది రెవెన్యూ గ్రామాలలో బుధవారం సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంను నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. రాయవరం మండలంలో వరి పొలాలు, పొలం దిమ్మలు అన్నిటికీ కలిపి 16,653 ఎకరాలకు మొత్తం 65 కేజీల బ్రోమోడయోలోన్ రసాయన మందును ప్రభుత్వం మండలంలోని 19 రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రోమోడయోలోన్ రసాయన మందును, ఎలుకల నివారణకు ఉపయోగించే ఎర తయారీలో వాడవలసి ఉంటుందని, ఒక ఎకరానికి నాలుగు గ్రాములు చొప్పున వరి నూకలతో కలిపిన ఎరలో కలపాలన్నారు. 100 గ్రాముల విషపు ఎర తయారీలో 2 గ్రాములు బ్రోమోడయోలోన్ మందును 96 గ్రాముల నూకలు, 2 గ్రాములు నూనె కలిపి ప్రతీ ఎలుక బొరియ కు 10 గ్రాములు చొప్పున పొట్లాలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సామూహిక ఎలుకల నివారణ లో భాగం కావాలని వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

