భవన నిర్మాణ కార్మికులు ఇ శ్రమ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆర్.సత్యవేణి
అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇ శ్రమ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆర్.సత్యవేణి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం లో గల కాపుల రామాలయం వద్ద శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కర్రి తాతారావు అధ్యక్షతన ప్రతి నెల 1వ తేదీన నిర్వహించే సమావేశంలో ఎ.ఎల్.ఒ సత్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా శాఖలలో విధులు నిర్వహిస్తున్న అసంఘటిత కార్మికులను ఇ శ్రమ పోర్టల్ లో నమోదు చేయించుకుని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ఉపయోగించుకోవాలని అన్నారు. సొంతంగా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా, లేదా మీ సేవా కేంద్రాలు, దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయంలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. వివిద శాఖలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఇ శ్రమలో నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, పూర్తి అంగవైకల్యం కలిగిన కార్మికునికి రూ.2లక్షలు, పాక్షిక అంగ వైకల్యం పొందిన కార్మికునికి రూ.1లక్ష బీమా సౌకర్యం పొందవచ్చని వివరించారు. వ్యవసాయ కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, ఇళ్లు, దుకాణాలలో పనిచేసే కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, మత్స్య కార్మికులు, పాల వ్యాపారులు, చేతివృత్తుల పనివారు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, జీపులు, ఆటోడ్రైవర్ల తో పాటు ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ సౌకర్యం లేని కార్మికులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల నమోదు, పునరుద్ధరణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని ఎవరైనా నమోదు చేసుకోకపోతే లేబర్ ఆఫీసులో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ, అంతా కలిసి ప్రభుత్వానికి, అధికారులకు ఉత్తరాలు రాసి, పంపించడం ద్వారా భవన నిర్మాణ కార్మికులు తమ ఆవేదనను వెల్లడి పరిచారు.

