నష్టాల ఊబిలోకి మారిన ఆక్వా పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోకుంటే అవసరమైతే ఆక్వా క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు తేల్చిచెప్పారు.. నాణ్యమైన విద్యుత్తు ఇవ్వకపోగా స్మార్ట్ మీటర్లు పేరుతో మరో ఇబ్బంది తప్పేటట్టు లేదని, ఇప్పటికే ట్రంప్ సుంకాల దెబ్బ, తెగుళ్లు, ఎక్స్‌ఫోర్టర్స్ మోసాలు ఇలా అనేక సమస్యలతో ఆక్వా రైతాంగం పరిస్థితి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆక్వా పరిశ్రమ అధఃపాతాళానికి వెళ్లేలా పరిస్థితి మారిందని విద్యుత్తు శాఖ అధికారులకు రైతులు తెలిపారు.. అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపం వద్ద బుధవారం ఆక్వా రైతులతో విద్యత్తు శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్ఈ రాజేశ్వరి, డీఈ అన్నవరం తదితర అధికారులు హాజరై రైతులతో చర్చించారు. ఈ సంర్భంగా రైతులు తాము ఎదుర్కొంటోన్న విద్యత్తు సమస్యలను అధికారులకు ఏకరవు పెట్టారు. ఆక్వా చెరువులకు లోడు సమస్య తీవ్రంగా వేధిస్తోందని, నాణ్యమైన విద్యత్తు కొరవడి ఖరీదైన మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక సాకులతో నిలిపివేసిన విద్యుత్తు కనెక్షన్లను వెంటనే పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామి ఇచ్చిన ప్రకారం పునరుద్ధరించాలని రైతులు కోరారు. దీనికి రైతుల నుంచి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కారానిక కృషిచేస్తానని హామీ ఇచ్చారు..
టర్న్‌కీ ఆమోదం కొంత వరకు ఊరటనిస్తోంది…
ఆక్వా చెరువుల వద్ద విద్యుత్తు వినియోగంకు స్పెషల్ లైన్‌కాస్ట్ (ఎస్పీఎల్) చార్జీలు విపరీతమైన రూ. ఆరు లక్షలు, పదిలక్షలు, ఏడు లక్షలు అంటూ ఎస్టిమేషన్ వేసి ఇవ్వడం జరిగేదని, అయితే టర్న్ కీ పద్దతిలో రైతులే నేరుగా ట్రాన్స్‌ఫార్మలు, ఇతర విద్యుత్తు సామాగ్రి ఎస్టిమేట్ వాల్యూకు పదిశాతం చెల్లించి మిగిలిన బయట కొనుగోలు చేయడం ద్వారా ఎస్టిమేషన్ కాస్ట్ తగ్గుతుందని దీనికి ఎస్ఈ అంగీకరించడం పై రైతులకు కొంత ఉపశమనం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.. ఈకార్యక్రమంలో స్టేట్ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం, కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు రుద్రరాజు నానీరాజు, ఫీడ్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి రమేష్‌రాజు, కోనసీమ ఆక్వా నూతన కార్యదర్శి చవటపల్లి మణికుమార్, బసవా మురళి, మేడిద శంకరం, మోటూరి నాని, శ్రీనురాజు, సత్తి శ్రీను, తోరం రాము, నంద్యాల సురేంద్ర, కాకిలేటి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి.. నాగభూషణం..
ఏపీలో 4.50 లక్షల ఎకరాలు సాగులోఉండగా దానిని 10 లక్షల ఎకరాల దిశగా ముందుకు సాగాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, అయితే ప్రభుత్వ ఆదాయ వృద్ధిలో 36 శాతం ఉన్నదానిని 50 శాతంకు తీసుకెళ్తామని చెప్పడం అభినందనీయమని, కానీ ఇటీవల కాలంలో ట్రంప్ ట్యాక్స్ ను సాకుగా చూపి ఎక్స్‌ఫోర్టర్స్ రైతులు పొందాల్సిన వేలాది కోట్ల సొమ్మును పక్కదారి పట్టించారని ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లొ నీలి విప్లవం కింద రూ.17 వేల కోట్లు ఆక్వాకు పెట్టి దానిలో భాగంగా విదేశాలనుంచి కలిపే రా మెటీరియల్ విదేశీ సుంకం నుంచి ఉపశమనం కల్పించినప్పటికీ ఇక్కడ ఉన్న సోయా, రైస్ బాన్ భారీగా తగ్గినప్పటికీ దీని ప్రకారం టన్నుకు రూ. 25 నుంచి రూ. 35 వేలు తగ్గాల్సి ఉండగా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకం
ఆక్వా పరిశ్రమను నమ్ముకున్న రైతాంగానికి అన్నింటా ఇబ్బందులే ఎదురవుతున్నాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతు సంఘం మాజీ అధ్యక్షుడు రుద్రరాజు నానీరాజు అన్నారు. హేచరీల్లో సీడ్ దశ నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొని ఎక్స్‌ఫోర్ట్ చేసే వరకు అన్నింటా రైతులకు అన్యాయమే జరుగుతుందన్నారు. ఆక్వా పరిశ్రమలోని ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..