: వైసీపీ అరాచక పాలన, కూటమి ప్రభుత్వ అభివృద్ధి- సంక్షేమ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరితే సజ్జల రామకృష్ణరెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు సవాల్ పై స్పందించడానికి నువ్వేమైనా ఎమ్మెల్యేవా? ఎమ్మెల్సీవా అని సజ్జలను ప్రశ్నించారు. మంగళవారం నాడు అమలాపురంలో సతీష్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని సజ్జల పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు కానీ చంద్రబాబు కాదని, వైసీపీకి ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు అసహ్యంగా చూస్తున్నారని అన్నారు. ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలనకు ప్రజలు 11 సీట్లిచ్చారు.. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. విపక్షంగాను వైసీపీ విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా డౌటేనని ఆయన వ్యాఖ్యానించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో డిపాజిట్ గల్లంతు.. ఒంటిమిట్ట జడ్పీటీసీలో ఘోర పరాజయంతో వైసీపీ నేతలకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలన.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని చంద్రబాబు సవాల్ విసిరితే జగన్ స్పందించాలి కానీ సజ్జలకు పనేమిటి? అని సతీష్ బాబు నిలదీశారు.
సూపర్ సిక్స్ పధకాలు సూపర్ హిట్ అని ప్రజలు ముక్త కంఠంతో చెబుతుంటే సూపర్ సిక్స్ హామీలపై కూటమిని ప్రశ్నిస్తామని సజ్జల ప్రకటించడం అవివేకం అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేకపోయారని, ఇప్పుడు ఉద్యోగుల పక్షాన పోరాడతామని సజ్జల ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించలేని దద్దమ్మలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడిని విమర్శించే అర్హత ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో శాసనసభను కౌరవ సభగా మార్చిన వైసీపీ ఇప్పుడు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. త్వరలో భూస్థాపితం అయ్యే పార్టీకి సజ్జల ఒక్కడే మిగిలాడని హేళన చేశారు. జగన్ కు దమ్ముంటే చంద్రబాబు సవాల్ పై స్పందించాలని సతీష్ బాబు డిమాండ్ చేశారు.

