-మమ్మల్ని కులం పేరుతో దూషించి.. వేధిస్తున్నారు..
-దొండపాటి దుర్గ ఆవేదన
రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన తాను బతుకుతెరువు నిమిత్తం పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని దొండపాటి దుర్గ తెలిపింది. రంగంపేట మండలం ఈలగోలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మన్ రాజు కుమార్తె ముత్య మాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి అనే ఆసామి తమను వీడియోలు తీసి, కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఆ పొలం తాను కౌలుకు తీసుకున్నానని అక్కడ పని చేయొద్దు అంటూ తమని ఇబ్బందులకు గురి చేయడమే గాక మా కులం అడిగిమరీ ఇబ్బందికరంగా అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అక్కడ పనులు ఆపేసి వెళ్లకపోతే చంపేస్తామని మా బంధు వర్గం అంతా రాజకీయాల్లోనే ఉన్నారని, అందరిని జైల్లో పెట్టిస్తానని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేయాలని రంగంపేట పోలీస్ స్టేషన్ కు వెళితే ఎస్సై ఇష్టం వచ్చినట్టుగా తమదే తప్పు అన్నట్టుగా పనికిమాలిన కేసులు పెట్టడానికి వచ్చారంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా స్పందన కు గత నెల 15వ తేదీన ఫిర్యాదు చేయగా తమను స్టేషన్ కు పిలిపించి కేసు వాపసు తీసుకోకపోతే మీ పైన కేసులు పెడతానని బెదిరించారని వాపోయారు. స్టేషన్లో వారికి కుర్చీలు వేసి కూర్చోబెట్టి మమ్మల్ని మాత్రం నిల్చోపెట్టి మాట్లాడడం తీవ్ర మనస్తాపం కలిగించిందని తెలిపారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన తమను దారుణంగా తిట్టిన అతడిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసినప్పటికీ వారిపై ఇప్పటివరకు కేసు కూడా నమోదు చేయలేదని తెలిపారు. బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ అక్కడ పొలానికి సంబంధించి తల్లి కూతుళ్ళ మధ్య వివాదం జరుగుతోందని ఈ విషయంలో మల్లిడి శ్రీనివాస రెడ్డి మధ్యలోకి వచ్చి ఆ పొలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళితులు, బీసీలను వేధింపులకు గురి చేస్తున్న శ్రీనివాసరెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పామాయిల్ గెలలు తరాలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేశారని, ఆ గెలలు ఏమయ్యాయో తెలియడం లేదని అన్నారు. ఈ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రంగంపేట ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత మహిళ దొండపాటి దుర్గ పై తప్పుడు కేసులు పెడతానని ఎస్సై బెదిరించడం దారుణం అని వ్యాఖ్యానించారు. అనపర్తి ఎమ్మెల్యే తన వెనక ఉన్నారంటూ ఆయనకు కూడా చెడ్డ పేరు తెచ్చేలా ఈ మల్లిడి శ్రీనివాసరెడ్డి భూ దందాలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.